Janhvi Kapoor: స్టార్ కిడ్స్ కష్టాలు ఎవ్వరూ వినరు.. ‘ఇన్‌సైడర్-అవుట్‌సైడర్’ చర్చపై జాన్వీ కపూర్ సంచలన కామెంట్స్
Janhvi Kapoor: సినీ పరిశ్రమలో ‘నెపోటిజం’, ‘ఇన్‌సైడర్ vs అవుట్‌సైడర్’ అనే అంశాలు ఎప్పుడూ చర్చనీయాంశాలే. వారసత్వ నేపథ్యం లేనివారు (అవుట్‌సైడర్స్) ఇక్కడ స్థిరపడటానికి పడే కష్టం అందరికీ తెలిసిందే. తాజాగా, ఈ సున్నితమైన అంశంపై దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయటి వ్యక్తుల పోరాటాలకు, సినీ కుటుంబాల నుంచి వచ్చిన వారి ఇబ్బందులకు మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ, నటీనటులను ‘బయటివారు’, ‘ఇండస్ట్రీవారు’ అని విభజించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే, సినీ నేపథ్యం లేని వ్యక్తులు ఎదుర్కొనే ఒడుదొడుకులతో తమ కష్టాలను పోల్చడం న్యాయం కాదని ఆమె అన్నారు. “బయటి వ్యక్తులు పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి చేసే పోరాటం, పడే కష్టం చాలా పెద్దది. ఆ కష్టాలు స్టార్ కిడ్స్‌కు పూర్తిగా అర్థం కావు, వాటిని మేం అనుభవించం కూడా” అని జాన్వీ వివరించారు.
అదే సమయంలో, స్టార్ కిడ్స్ తమ ఇబ్బందులు చెప్పుకుంటే ఎవరూ సానుభూతి చూపరని, వినడానికి కూడా ఆసక్తి చూపరని జాన్వీ తెలిపారు. “స్టార్ కిడ్స్ ఇబ్బందులు పడుతున్నామని చెబితే అది కొందరికి విడ్డూరంగా అనిపించవచ్చు. అందుకే ఇండస్ట్రీకి చెందినవారు ఎవరూ తాము కష్టాలు పడ్డామని చెప్పరు. బయటివారికి దక్కని ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు తమకు వారసత్వంగా లభించినందుకు వారెప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు” అని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో తాము ఎంత కష్టపడుతున్నామని చెప్పినా, దాన్ని ఎవరూ పట్టించుకోరని జాన్వీ కపూర్ తమ తరపు వాదన వినిపించారు.
శ్రీదేవి కుమార్తెగా వెండితెరపైకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆమె నటించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ చిత్రం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఉత్తరాదితో పాటు ప్రస్తుతం దక్షిణాదిలోనూ అవకాశాలు దక్కించుకుంటూ ఆమె తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.