Janhvi Kapoor: శ్రీదేవి మూవీ రీమేక్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఏ సినిమా అంటే?
Janhvi Kapoor: దివంగత అలనాటి తార శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పుడు దక్షిణాదిలో అడుగుపెట్టారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ‘దేవర’లో నటిస్తున్న జాన్వీ, ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘పెద్ది’ అనే సినిమా చేయనున్నారు. అయితే, జాన్వీ ఇప్పుడు తన తల్లి నటించిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్‌లో నటించనుందని వస్తున్న వార్తలు సినీ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
నాలుగు దశాబ్దాల క్రితం శ్రీదేవి నటించి సంచలనం సృష్టించిన చిత్రం ‘చాల్‌బాజ్’. 1989లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లు సాధించి, శ్రీదేవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో ఆమెతో పాటు రజనీకాంత్, సన్నీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు, ఈ క్లాసిక్ హిందీ సినిమాను రీమేక్ చేయబోతున్నారని, ఇందులో శ్రీదేవి పాత్రలో జాన్వీ కపూర్ నటించనున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం తుది దశలో ఉందని, ఈ నెలాఖరులో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
జాన్వీ కపూర్ తన తల్లి నటించిన సినిమాల్లో ‘చాల్‌బాజ్’ అంటే తనకు చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ఇప్పుడు అదే సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల ఆమె చాలా సంతోషంగా ఉన్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఈ రీమేక్ కథలో మార్పులు చేస్తారా, లేక ఒరిజినల్ కథనే కొనసాగిస్తారా, దర్శకుడు ఎవరు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వార్తపై అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.