Janhvi Kapoor: మరో వివాదంలో జాన్వీ కపూర్.. దుమారం రేపుతున్న సింగర్ పవిత్ర విమర్శలు..!
Janhvi Kapoor: బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ నటి జాన్వీ కపూర్ తాజా చిత్రం వివాదంలో చిక్కుకుంది. జాన్వీ ప్రధాన పాత్ర పోషిస్తున్న హిందీ సినిమా ‘పరమ్ సుందరి’ విడుదల కానున్న తరుణంలో, ఆమె నటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, సినిమాలో ఆమె పోషించిన మలయాళీ యువతి పాత్ర, ఆమె యాసపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం మలయాళీ గాయని పవిత్ర మీనన్ వ్యాఖ్యలతో మొదలైంది. ఒక మలయాళీ యువతి పాత్రకు అదే సంస్కృతికి చెందిన నటిని కాకుండా, జాన్వీని ఎందుకు ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు జాన్వీ యాసను వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో, జాన్వీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వీడియోను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వీడియో తొలగించబడింది.
అయితే, పవిత్ర మీనన్ ఇంతటితో ఆగకుండా, తన వీడియో తొలగించబడిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ మరోసారి తన వాదనను గట్టిగా వినిపించారు. దీంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ప్రస్తుతం ఈ అంశంపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రాంతీయ పాత్రలకు ఆయా భాషలు తెలిసిన నటులను తీసుకోవడమే సరైన పద్ధతి అంటూ పవిత్రకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు నటనకు భాషతో సంబంధం లేదని, ఒక నటి పాత్రను నిజాయితీగా పోషిస్తే చాలు అంటూ జాన్వీకి మద్దతు తెలుపుతున్నారు.
ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ వివాదం సినిమా విడుదలకు ముందు ఊహించని హైప్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ అంశంపై చిత్రబృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
