Jatadhara: సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి.. సోనాక్షి సిన్హా షాకింగ్ కామెంట్స్
Jatadhara: బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తాను కీలక పాత్ర పోషించిన ‘జటాధర’ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సమయపాలన విషయంలో హిందీ పరిశ్రమ కంటే దక్షిణాది సినీ ప్రపంచం ఎంతో మెరుగ్గా ఉందని ఆమె ప్రశంసించారు.
వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో, కథానాయకుడు సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందిన ‘జటాధర’ చిత్రంతో సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు ప్రాంతీయ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉందని, కానీ వరుస షెడ్యూల్స్ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక కుదరలేదని ఆమె వెల్లడించారు.
దక్షిణాది సినిమా షూటింగ్‌ల గురించి ప్రస్తావిస్తూ… “నేను గతంలో తమిళ చిత్రం ‘లింగ’లో నటించాను. ఇప్పుడు ‘జటాధర’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను. సౌత్‌లో సెట్స్‌పై ఉండే క్రమశిక్షణ చాలా అద్భుతం. ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే, సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్ కొనసాగించరు. ఇది చాలా మంచి పద్ధతి. ఇలాంటి విధానాన్ని పాటించాలంటే టీమ్ మొత్తం అంకితభావం, క్రమశిక్షణతో ఉండాలి,” అని సోనాక్షి సిన్హా వివరించారు.
హిందీ సినీ పరిశ్రమలో తరచుగా అర్థరాత్రి వరకు చిత్రీకరణలు జరుగుతాయని, ఈ విషయంలో బాలీవుడ్ మారాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. దక్షిణాది పరిశ్రమ పాటిస్తున్నట్లుగా కచ్చితమైన సమయపాలనను హిందీ చిత్ర పరిశ్రమ కూడా అనుసరించాలని ఆమె సూచించారు.
‘జటాధర’ సినిమా విషయానికి వస్తే, ఇందులో సోనాక్షి సిన్హా నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనున్నారు. కేరళలోని ప్రఖ్యాత అనంతపద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన రహస్యాల చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్ర చేయలేదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
