Junior NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై శింబు షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
Junior NTR: తమిళ అగ్ర నటుడు శిలంబరసన్ టీఆర్ (శింబు), జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం తెలుగు ప్రచార చిత్రం (ప్రోమో) సంచలనం సృష్టిస్తోంది. తమిళంలో ‘అరసన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో తీసుకువస్తున్నారు.
ఈ ఉత్కంఠభరితమైన ప్రోమోను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఎన్టీఆర్ ఈ ప్రోమోను షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే, తెలుగు-తమిళ సినీ అభిమానుల మధ్య ఇది వేగంగా వైరల్ అయింది.
సామ్రాజ్యం ప్రోమో సంచలనం సృష్టించడానికి ముఖ్య కారణం, ఇందులో శింబు చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య. ప్రోమోలో ఒక సన్నివేశంలో, శింబు తన కథను మీడియా మిత్రులతో పంచుకుంటున్నట్లుగా కనిపిస్తారు. ఈ సందర్భంగా, “సార్.. నా కథను ఒకవేళ సినిమాగా తీయాల్సి వస్తే… దయచేసి ఎన్టీఆర్‌తో చేయించండి. ఆయనైతే పర్ఫార్మెన్స్ కుమ్మేస్తాడు” అంటూ డైలాగ్ చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
వెట్రిమారన్ సృష్టించిన క్రైమ్ యూనివర్స్ ‘వడ చెన్నై’ నేపథ్యంలోని కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం, అందులో ఆయన పేరు ప్రస్తావన రావడంతో ఈ అంశంపై మరింత చర్చ జరుగుతోంది.
ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషా చిత్రాలను, నటీనటులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు. గతంలో ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్, ఇప్పుడు శింబు సినిమా ప్రోమోను విడుదల చేయడం, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను ‘వి క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.