Kalyani Priyadarshan: ‘ఫీమేల్ సూపర్ హీరోగా గుర్తింపు లభించడం గర్వంగా ఉంది’
Kalyani Priyadarshan: ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోక: చాప్టర్ 1: చంద్ర’ (Lokah Chapter 1: Chandra) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కావడంపై తాజాగా కల్యాణి ప్రియదర్శన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి మహిళా సూపర్‌హీరో చిత్రంలో నటించడం గర్వంగా ఉందని కల్యాణి ప్రియదర్శన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి తాను ఓ మహిళా సూపర్‌హీరోనని చాలా మంది తనను పిలుస్తున్నారని, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని కల్యాణి అన్నారు. ఈ సినిమా విజయం కోసం తాను మాత్రమే కాకుండా చిత్రబృందం మొత్తం ఎంతో కష్టపడిందని, ఈ విజయం మొత్తం వారందరికీ దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినప్పుడు ఇంత భారీ విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని, కేవలం ఒక మంచి కథలో భాగం కావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించానని ఆమె తెలిపారు. సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ చిత్రం విజయం సాధిస్తుందని తనకు నమ్మకం కుదిరిందని కల్యాణి చెప్పారు.
‘లోక’ భారీ వసూళ్లు..
ప్రేక్షకులు తనను అభినందిస్తూ ఈ సినిమా మొత్తాన్ని తానే భుజాలపై వేసుకుని నడిపించానని చెబుతున్నారని, కానీ చిత్రబృందంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని కోసం శ్రమించారని ఆమె అన్నారు. ‘లోక: చాప్టర్ 1: చంద్ర’ తొలి మహిళా సూపర్‌హీరో చిత్రం కావడంతో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని, హీరోయిన్లు కూడా ఏ పాత్రలైనా చేయగలరని ఈ సినిమా నిరూపించిందని ఆమె తెలిపారు.
డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మలయాళ చిత్రంగా నిలిచిందని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.
