Marudhanayagam: పాతికేళ్ల కల నెరవేరబోతోందా? ఏఐ (AI) మాయాజాలంతో కమల్ ‘మరుదనాయగం’ రీ-స్టార్ట్!
Marudhanayagam: విశ్వనటుడు కమల్ హాసన్ అంటేనే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ లోకనాయకుడి కెరీర్‌లో ఇప్పటికీ తీరని అతిపెద్ద కోరిక ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ‘మరుదనాయగం’ సినిమానే. శతాబ్దాల నాటి ద్రవిడ యోధుడి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలని కమల్ ఎప్పుడో కలలు కన్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఆధునిక సాంకేతికత పుణ్యమా అని మళ్ళీ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం, అంటే 1996లో కమల్ హాసన్ ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సినిమా బడ్జెట్ రూ. 10 కోట్లు అంటేనే అద్భుతం అనుకునే రోజుల్లో, కమల్ ఏకంగా రూ. 50 కోట్లతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఏడాదిన్నర పాటు శ్రమించి, కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పట్లోనే దీనికోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశారు. కానీ అనుకోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ మహత్తర ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయినప్పటికీ కమల్ ఏనాడూ ఈ కథను మర్చిపోలేదు. సరైన సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ లెక్కల ప్రకారం, ఇప్పుడు ‘మరుదనాయగం’ తీయాలంటే కనీసం రూ. 500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ఇప్పుడు రాజ్యమేలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ సినిమాకు వరంగా మారనుందని కోలీవుడ్ టాక్. అత్యాధునిక ఏఐ టూల్స్ ఉపయోగించి, భారీ సెట్టింగులు, యుద్ధ సన్నివేశాలను తక్కువ ఖర్చుతో సృష్టించవచ్చని, తద్వారా బడ్జెట్‌ను రూ. 500 కోట్ల నుంచి కేవలం 25 శాతానికి (అంటే సుమారు రూ. 125-150 కోట్లకు) తగ్గించవచ్చని కొన్ని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు కమల్‌ను సంప్రదించాయట.
ఈ ప్రతిపాదన పట్ల కమల్ హాసన్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, ఏఐ సాంకేతికతతో ఒక పీరియాడిక్ సినిమాను పూర్తి చేసి, కమల్ హాసన్ మరోసారి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడిగా నిలవడం ఖాయం.
