Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ సునామీ: కేవలం 3 రోజుల్లో రూ.235 కోట్ల వసూళ్లు
Kantara Chapter 1: కన్నడ చలనచిత్ర పరిశ్రమ నుంచి విడుదలై, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. అంచనాలకు మించి దూసుకుపోతున్న ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. అందిన సమాచారం ప్రకారం, ఈనెల 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా (గ్రాస్) వసూలు చేసినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘనతతో, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ చిత్రాల జాబితాలో ‘కాంతార 1’ తాత్కాలికంగా నాలుగో స్థానంలో నిలిచింది.
‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రం, ప్రేక్షకులను దైవిక అంశాలు, అద్భుతమైన కథనంతో కట్టిపడేసింది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు.
రిషబ్ శెట్టి క్రియేటివిటీ, డెడికేషన్ కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వంటి వారు చిత్ర బృందాన్ని అభినందించగా, తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ శెట్టిలోని సృజనాత్మకత, ప్యాషన్‌ను సుకుమార్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
రిషబ్ శెట్టి ఈ చిత్రాల ద్వారా తుళునాడులోని దైవాల్లో ఒకటైన పంజుర్లి గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ దైవంపై, రిషబ్ శెట్టి పాత్ర వేషధారణపై ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. దీనికి నిదర్శనంగా, తమిళనాడులోని దిండిగల్‌లో ఒక అభిమాని పంజుర్లీ వేషధారణలో థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు. సినిమా ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.