Kantara Chapter 1: రిస్క్ చేస్తున్న రిషబ్ శెట్టి.. ‘కాంతార చాప్టర్ 1’పై అంచనాలు పెంచుతున్న ఫైట్స్!
Kantara Chapter 1: దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకున్న కన్నడ సంచలనం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. స్వీయ దర్శకత్వంలో హీరో రిషబ్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022లో విడుదలైన ‘కాంతార’ కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘కాంతార చాప్టర్ 1’ విడుదల కానుంది.
మొదటి భాగం కేవలం కన్నడ భాషలో విడుదలై, ఆ తర్వాత ఇతర భాషల్లో అనువాదమైంది. అయితే ఈసారి ప్రీక్వెల్‌ను ఏకకాలంలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ‘కాంతార’ కథ ఎక్కడ మొదలైందో, దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ముఖ్యంగా ‘పంజుర్లి’ దైవానికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన స్టంట్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్.. రిషబ్ శెట్టి అంకితభావం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “సినిమాలోని అన్ని యాక్షన్ సన్నివేశాలను రిషబ్ స్వయంగా చేశారు. ఎక్కడా డూప్ వాడలేదు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీతో పాటు, కేరళ యుద్ధ కళ అయిన ‘కలరిపయట్టు’లో శిక్షణ తీసుకుని, అద్భుతమైన ఫైట్లు చేశారు” అని ఆయన ప్రశంసించారు.
“నేను చాలా మంది నటులతో పని చేశాను, కానీ రిషబ్ లాంటి నిబద్ధత ఉన్న హీరోను చూడలేదు. ‘నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను’ అని అనడమే కాదు, ‘బ్రతికి ఉన్నంత వరకు చేస్తాను’ అని చెబుతారు. ఆయన నిజంగా స్ఫూర్తిదాయకం” అంటూ అర్జున్ రాజ్ పొగడ్తలతో ముంచెత్తారు. రిషబ్ చేసిన రిస్కీ స్టంట్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
