ఇప్పుడు సినీ ప్రపంచంలో “కాంతార” సినిమా ఒక సంచలనం. ప్రేక్షకులే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమా హీరోలు కూడా ఈ సినిమాను చూశారు. IMDB(International Movie Data Base) రేటింగ్ (9.5/10) లో ఈ సినిమా మొదటి స్థానంలో ఉంది. తమిళ హీరో ధనుష్ వంటివారు ఈ సినిమాల గురించి మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం విశేషం. హీరో ప్రభాస్ ఈ సినిమా రెండుసార్లు చూసి ఇది అందరూ తప్పక చూడవలసిన సినిమా అని ట్వీట్ చేశాడు! ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో అందరూ చర్చించుకుంటున్న సినిమా ఇది.
దక్షిణ కర్ణాటక లోని కెనరా, ఉడిపి,కేరళలోని కాసరగోడ్ ప్రాంతాలను కలిపి “ తుళునాడు” అంటారు. ఆ ప్రాంతంలో జరిగే భూత కోలా అనే సాంప్రదాయం పై అల్లుకున్న కథ తో తీసిన సినిమా “కాంతార” (అంతుచిక్కని అడవి-) 2 వారాల క్రితం సెప్టెంబర్లో కర్ణాటకలో విడుదల అయిన ఈ సినిమా 2 రోజుల క్రితం ఆంధ్రదేశంలో విడుదలైంది. ఒక ప్రాంతానికే పరిమితమై చాలా భక్తిశ్రద్ధలతో నడిపే ” భూత కోలా” అనే ఒక ఆచారాన్ని కథావస్తువుగా తీసుకుని సినిమా తీయడం సాహసమే.
ఒక మారుమూల ప్రాంతంలో జరిగే ఒక ఆచారాన్ని దేశంలో ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేసే ప్రయత్నం కాంతార. ఈ ప్రయత్నం పూర్తిగా సఫలం అయింది. కన్నడ లో సూపర్ హిట్ అయింది.. అయితే తెలుగు, హిందీలో కూడా విజయవంతమైంది, గాడ్ ఫాదర్, ఘోస్ట్ లాంటి పెద్ద హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసింది. కనీసం 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసిన సినిమాగా అనిపించే కాంతార 100 కోట్ల పైగా వసూలు చేసి “100 కోట్ల క్లబ్” లో చేరిపోయింది. కేవలం 16 కోట్లతో ఈ సినిమా తీశారు అంటే నమ్మలేని పరిస్థితి ని క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి అత్యంత భారీ సినిమాలతో పోల్చుకుంటున్న ఈ సినిమాలో ఇంతకీ ఏముంది?
నిజం చెప్పాలంటే చాలా సాధారణమైన కథాంశం. ఈ సినిమాలో ఉన్న నటీనటుల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. హీరో రిషబ్ షెట్టి (కన్నడ “బెల్ బాటం” సినిమా హీరో) ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తీసింది కే జి ఎఫ్ సినిమా నిర్మాతలే. అది ఒక్కటే చెప్పుకోదగ్గ విషయం. అయితే భారతదేశంలో కూడా చాలా మందికి పూర్తిగా తెలియని ఒక అంశాన్ని చాలా పకడ్బందీగా, డీటెయిల్డ్ గా ప్రజెంట్ చేసిన విధానం ఈ సినిమా కి ప్రధాన బలం . కొంత నాటకీయత, మరికొంత సినిమాటిక్ లిబర్టీ ఆసరాగా తీసుకొని మొత్తం అడవిలోనే తీసినప్పటికీ ప్రేక్షకులను సినిమాలో పూర్తిగా లీనం కావడానికి సాయం చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
1990 నాటి కాలాన్ని సినిమాలో ప్రతిబింబించేల చేయడంలో దర్శకుడి తో పాటు సినిమా బృందం మొత్తం పడిన కష్టం చేసిన శ్రమ, అరవింద్ కాష్యప్ ఫోటోగ్రఫి, లోకేష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, చక్కని, థ్రిల్లింగ్ సన్నివేశాలతో బాగా రాసుకున్న స్క్రీన్ ప్లే, హీరో నటన వంటి అంశాలు, సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ప్రారంభంలోనే హీరో ఇంట్రడక్షన్ సీన్ తో దర్శకుడు సినిమా ఎలా ఉంటుందో చెప్పేశాడు.. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సీన్ ఫోటోగ్రఫీ ఎలా ఉండబోతుంది, సంగీతం ఎలా ఉండబోతుంది, హీరో క్యారెక్టర్ ఏంటి అన్నది మొదటి పది నిమిషాల్లోనే తెలిసిపోతుంది.
కంబాల అనే ఒక ఆట తో సినిమా ప్రారంభం అవుతుంది. కంబాల అనేది తమిళనాడు లోని జల్లికట్టు లాంటిది. దక్షిణ కర్ణాటక లో ఉన్న జమీందార్లు నిర్వహించే ఆట. అందులో బురద తో నిండిన పొలంలో రెండు గేదెలతో పందెం నిర్వహిస్తారు. గేదెలను ఒక దూలనికి కట్టి పరిగెత్తిస్తూ ఎవరు ముందుగా గీతను దాటితే వారికి బహుమతి ఉంటుంది. ఈ పందెం చిత్రీకరణలో నే ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. పందెం తర్వాత బురద లో వచ్చే ఫైట్ చాలా న్యాచురల్ గా త్రిల్లింగ్ గా తీశారు. ఈ సినిమా లో మొదటి పదిహేనునిమిషాలు, చివరి 20 నిమిషాలు చాలా కీలకమైనవి. ఎవరైనా లేటుగా సినిమాకి వెళ్లి మొదటి పది నిమిషాలు మిస్ అయితే తర్వాత ఫీల్ కాక తప్పదు.
ఈ సినిమాను నిలబెట్టింది అడవిలో చేసిన చిత్రీకరణ . సన్నివేశాలకి సరిపోయే లైటింగ్, యాంగిల్స్ ప్రేక్షకులను అడవిలో ఉన్నామేమో అన్న భావనను కలిగించాయి. దీనికి ఉదాహరణ సినిమా లో మొట్టమొదటి సీను, చివర్లో 20 నిమిషాల క్లైమాక్స్. ఈ 20 నిమిషాల క్లైమాక్స్ లో రిషబ్ షెట్టి నటన చాలా గొప్పగా ఉంది. ఈ సినిమాకు లోకేష్ అందించిన నేపథ్య సంగీతం హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఈ సినిమాలో ప్రస్తావించ దగ్గ విషయం మరొకటి ఉంది. అది కామెడీ! అదేపనిగా కామెడీ ట్రాక్ చొప్పించి ఒక థ్రిల్లర్ సినిమాను దెబ్బతీసే ప్రయత్నం చేయకపోవడం దర్శకుడి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. సినిమా లో భాగంగానే కామెడీ నడుస్తుంది తప్ప కామెడీ కోసమే ఉన్నట్టు ఉండదు. అందుకే సినిమాలో కామెడీ చాలా రిలీఫ్ ని ఇచ్చింది. సినిమా సీరియస్ నెస్ ను ఎక్కడ దెబ్బ తీయలేదు..ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి సినిమాలో పాత్రలు నేల విడిచి సాము చేయలేదు. ఇది సినిమాకు కనిపించని బలం.
ఇంత చెప్పిన తర్వాత మరో విషయం చెప్పాలి. అది ఈ సినిమాలో లోపాలు ఏమీ లేవా? అన్న ప్రశ్నకు సమాధానం.
లోపాలు ఇందులో కూడా ఉన్నాయి. నిడివి కొంత తగ్గించి ఉంటే బాగుండేదేమో, సెకండ్ హాఫ్ లో సినిమా కాసింత స్లో కావడం వంటివి అనిపించవచ్చు. ఇక్కడ నేనొక ఒక విషయం చెప్తాను. దాదాపు అందరూ రివ్యూ రైటర్స్ సినిమా చూసేటప్పుడు డైరెక్టర్ తప్పులో కాలేసిన సందర్భాలు, సినిమా బాగా లేని సందర్భాలు అన్నింటిని మైండ్లో పెట్టుకుంటూ వస్తారు. నేను కొన్ని వందల సినిమాలకు రివ్యూ రాశాను. రివ్యూ రాయటం కోసమే కొన్ని సినిమాలు చూశాను. అయితే కొన్ని సినిమాల్లో మాత్రమే నేను రివ్యూ సంగతి మర్చిపోయి సినిమాలో లీనమైపోయాను. అందులో ఈ సినిమా కూడా ఒకటి.
ఇది చంద్రుడి వంటి సినిమా. చంద్రుడికి ఒక మచ్చ ఉన్నట్టు ఈ సినిమాకి కూడా కొన్ని మచ్చలు ఉన్నాయి. అయితే సిన్మా చూస్తున్న క్రమంలో అవి ప్రేక్షకులు మర్చి పోతారు లేదా పట్టించుకోరు. అదే ఈ సినిమా ప్రత్యేకత. మనం చంద్రుని మచ్చలు పట్టించుకోకుండా వెన్నెలను ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా కూడా అంతే.. డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశ పర్చదు. సినిమాను ఎంజాయ్ చేయాలని భావిస్తే, హీరో ప్రభాస్ చెప్పినట్లు, ఇది అందరూ తప్పక చూడాల్సిన సినిమా కాకపోయినా, అందరూ చూడదగ్గ సినిమా అని నా అభిప్రాయం కూడా.

