Karisma Kapoor: రెండు నెలలుగా ఫీజులు కట్టలేదు.. కరిష్మాకపూర్ కుమార్తె కామెంట్స్
Karisma Kapoor: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ కుటుంబానికి సంబంధించిన రూ.30 వేల కోట్ల వారసత్వ ఆస్తి వివాదం ఢిల్లీ హైకోర్టులో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం జరిగిన విచారణలో కరిష్మా పిల్లలు, సమైరా, కియాన్‌ల తరఫు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు.
పిల్లల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలాని వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న సమైరాకు గత రెండు నెలలుగా విద్యా ఖర్చుల కింద ఫీజులు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిల్లల చదువు ఖర్చుల బాధ్యత తండ్రి సంజయ్ కపూర్ వహించాల్సి ఉండగా, ఆస్తిపై నియంత్రణ కలిగి ఉన్న సంజయ్ ప్రస్తుత భార్య ప్రియా సచ్‌దేవ్ ఫీజులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే ఈ వాదనలను ప్రియా సచ్‌దేవ్ తరఫు న్యాయవాది రాజీవ్ నాయర్ బలంగా ఖండించారు. జఠ్మలాని వాదనలు పూర్తిగా కల్పితమైనవని, ప్రియా సచ్‌దేవ్ పిల్లల పట్ల నిరంతరం సహాయంగా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఫీజు చెల్లింపులు పూర్తయ్యాయని, ఈ అంశాన్ని కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే కోర్టులో లేవనెత్తారని ఆయన పేర్కొన్నారు.
రెండు వైపులా వాదనలు విన్న జస్టిస్ జ్యోతిసింగ్.. ఈ కేసు నడుస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు విచారణను మెలోడ్రామాగా మార్చవద్దని న్యాయవాది రాజీవ్ నాయర్‌ను హెచ్చరించారు. “ఇలాంటి కుటుంబ సంబంధిత వివాదాలు కోర్టు బయట పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మళ్లీ మళ్లీ చిన్న చిన్న విషయాలను బెంచ్ ముందుకు తీసుకురావద్దు” అని న్యాయమూర్తి ఆదేశించారు.
కరిష్మా, సంజయ్ కపూర్‌లు 2003లో వివాహం చేసుకుని 2016లో విడాకులు తీసుకున్నారు. వారికి సమైరా, కియాన్ సంతానం. సంజయ్‌కు చెందిన సుమారు రూ.30 వేల కోట్ల విలువైన సంపదలో వాటా కోసం కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి మరణించిన తర్వాత ఆయన వ్యక్తిగత ఆస్తుల వివరాలు తెలియవని, తమ సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ ఫోర్జరీ చేసి నకిలీ వీలునామాను సృష్టించారని పిల్లలు తమ అభ్యర్థనలో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తులో భాగంగా, సంజయ్ స్థిర, చరాస్తుల వివరాలను సమర్పించాలని ప్రియా సచ్‌దేవ్‌ను న్యాయస్థానం గతంలో ఆదేశించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.
