Karnataka Election Results 2023 : మోదీ చరిష్మా కన్నడ నాట పనిచేయలేదనే చెప్పాలి. బీజేపీకి దక్షిణ భారత దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటకను కూడా ఆ పార్టీ చేజేతులా చేజార్చుకున్నట్లయింది. మితిమీరిన విశ్వాసం బీజేపీ ఆధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, వికటించిన గుజరాత్ తరహా ఆభ్యర్థుల ఎంపిక స్వయంకృతాపరాధం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈసారి కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం, అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం విజయావకాశాలను దెబ్బతీశాయి.
ఎన్నికల ప్రచారం చివర్లో భాజపా దిగ్గజ నేతలు మోదీ, షా, యోగి త్రయం ప్రచారం చేసినా.. అవి ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు చాలా ముందుగానే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో నాయకత్వం చొరవ చూపకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. బీజేపీ అంతర్గత కలహాలు. అమూల్ పాలు ఓటమికి కారణాలు నందిని పాలు, పాల ఉత్పత్తులకు కన్నడనాట విశేష ఆదరణ ఉంది. కర్ణాటక ప్రజల జీవనం లో నందిని ఒక భాగంగా మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాలు, పాల ఉత్పత్తులను కర్ణాటకలో ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు చేతికి కొత్త ఆయుధం లభించింది.
అవినీతి ఆరోపణలు..
కర్ణాటక ప్రభుత్వంపై ఎన్నికల ముందు వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. కర్ణాటక కాంట్రాక్ట్ అసోసియేషన్ నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేసింది. పబ్లిక్ ప్రాజక్టుల్లో 40% కమిషన్ తీసుకొంటోందని ఆరోపించింది. 2021లో ఈ సంఘం కర్ణాటకలో అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాసింది. కానీ ఎటువంటి చర్యలు లేవు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చేపట్టిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చింది. ఎన్నికలకు ముందు భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్టు కూడా పార్టీని బాగా దెబ్బతీసింది.
ప్రభుత్వ వ్యతిరేకత.. నిరుద్యోగం ధరల పెరుగుదల..
కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాషాయం పార్టీ ఓటమికి కారణమైంది. గత 20 ఏళ్లలో వరుసగా ఏ పార్టీ రెండోసారి అధికారం చేపట్టలేదు ముఖ్యంగా వంటగ్యాస్, చమురు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. దీనిని ఎదుర్కోవడానికి భాజపా ఏటా ఉగాది, గణేశ్ చతుర్థి, దీపావళి సమయంలో పేదలకు మూడు ఎల్‌పీజీ సిలిండర్లు, రేషన్ ఉచితంగా ఇస్తామన్న హామీ ఆకట్టుకోలేదు.
సామాజిక వర్గంలో ఓట్లలో చీలిక..
ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని బెలగావి, ధార్వాడ్, గడగ్ జిల్లాలతో పాటు బగల్‌కోట్, బీజాపుర్, కలబురిగి, బీదర్, రాయచూర్‌లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వీరికి ఓట్లు ఉన్నాయి. ఇక దక్షిణ కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, మాండ్యల్లో లింగాయత్‌ల ప్రభావం కనిపిస్తుంది. కర్ణాటకలోని 224 సీట్లలో లింగాయత్ సామాజిక వర్గానికి దాదాపు 70 సీట్లలో బలమైన పట్టుంది. దాదాపు 100 సీట్లలో వీరి ప్రభావం ఉంది. ఈ ఓటు బ్యాంక్ ఈ సారి ఈ ఓటు బ్యాంక్ చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి కారణం. 2021 జులైలో భాజపా యడియూరప్పను బలవంతంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం.
ఈ చర్య ఆ సామాజిక వర్గానికి నచ్చలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మరో లింగాయత్ నేత బసవరాజ్ బొమ్మై వచ్చారు. కానీ, ఆ సామాజికవర్గంలో ఆయనకు అంత పట్టులేదు. దీనికి తోడు ఈసారి ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సావడి వంటి నేతలకు మొండి చెయ్యి చూపింది. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. 2023లో యడ్డీ బరిలో లేకపోవడం.. ఇద్దరు కీలక నేతలు పార్టీ మారడంతో ఈ సామాజిక వర్గం ఓట్లు కొంత కాంగ్రెస్ వైపు మళ్లాయి.
ఫలించిన పంచతంత్రం..
దేశవ్యాప్తంగా అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఊరట కలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలల ముందు నుంచే క్షేత్రస్దాయిలో, క్రియాశీలకంగా వ్యవహరించింది. కార్యకర్తలను సన్నాహపరచింది. ఎన్నికల వ్యూహాన్ని ఖచ్చితత్వంతో అమలు చేసి ఓటర్ మన్నన పొందింది.
1. సానుభూతి పనిచేసింది..
ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటానికి రాజకీయ సంక్షోభానికి కి భాజపానే కారణమనే విమర్శలు తలెత్తాయి. దీంతో ఈ సానుభూతి కాంగ్రెస్‌కు అక్కరకొచ్చింది. ఫలితంగా 2023 ఎన్నికల్లో హస్తం పార్టీకి అవసరమైన దానికంటే ఎక్కువగా సీట్లను కట్టబెట్టారు.
2. 40% కమీషన్ సర్కార్ నినాదం..
భాజపా ప్రభుత్వాన్ని ’40శాతం కమీషన్ సర్కార్’ అని అభివర్ణిస్తూ కాంగ్రెస్‌విమర్శలు గుప్పించింది. అదే సమయంలో అవినీతి వ్యవహారానికి సంబంధించిన కేసులో రాష్ట్ర మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదవడం బొమ్మై ప్రభుత్వాన్ని కుదిపేసింది. మరో ఎమ్మెల్యే విరూపాక్షప్ప నివాసంలో కోట్లాది రూపాయల ధనం దొరకడం సంచలనంగా మారింది కాంగ్రెస్.దీన్ని తమ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది.
3. ఫలించిన ‘ఐదు గ్యారెంటీ’ల ‘ వ్యూహం..
‘ఐదు గ్యారెంటీ’లను ప్రకటించింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అన్నభాగ్య పథకం కింద నిరుపేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. యువ నిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ.3,000, రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని వాగ్దానాలు గుప్పించింది.
భాజపా అమలుచేసిన జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని రద్దుచేసి కర్ణాటక విద్యావిధానం (కేఈపీ)ని అమలు చేస్తామని తెలిపింది. భాజపా తీర్మానించిన ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు తొలగించి, ఎస్‌సీలకు 17 శాతం, ఎస్‌టీలకు 7% రిజర్వేషన్ కల్పిస్తూ.. జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రమాణాలను సవరిస్తామని పార్టీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 75%కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ ప్రకటించిన పలు ఉచితాలు, ఆకర్షణీయ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.
4. జోడో యాత్ర నింపిన జోష్..
దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటిచెప్పడం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’.. కర్ణాటకలో పార్టీకి కొత్త ఊపునిచ్చింది. మొత్తం 140 రోజులకు పైగా సాగిన ఈ యాత్రలో.. అత్యధికంగా 21 రోజులు రాహుల్ కర్ణాటకలో నడిచారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
5. నాయకత్వ ఐకమత్యం..
పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినా.. వాటిని బయటికి రాకుండా పరిష్కరించుకుంది. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఐకమత్యంగా కన్పించారు. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే సమర్థంగా వ్యవహరించారు. పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో సఫలమయ్యారు. బొమ్మై సర్కారుపై వచ్చిన వ్యతిరేకతను.. సిద్ధూ-డీకే తమకు అనుకూలంగా మల్చుకుని చేసిన ప్రచారం హస్తానికి కలిసొచ్చింది.
ప్రభావం చూపని జె.డి.యస్..
కాంగ్రెస్, బీజేపీలకు తగిన మెజారిటీ రాకుండా తనకు 30 సీట్లు లభిస్తే కింగ్ మేకర్‌గా ఉండొచ్చనుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి కలలు కల్లలయ్యాయి. జేడీఎస్ శ్రేణుల్లో ఫలితాలు నిరాశను కలిగించాయి. కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గంగావతిలో సొంత పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఆయన సత్తా చాటుకున్నారు. 15 స్థానాల్లో పోటీ చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఎమైనా ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పు శిరోధార్యం. ఈ ఎన్నికల ఫలితాన్ని గుణపాఠంగా తీసుకుని ఉత్తరాది దక్షిణాది అసమానతలను చూపకుండా ఒక్కరీతిన ఆభివృద్ది చెయ్యాలి. మాటలు చెప్పే బీజేపీ చేతల్లో చూపాలి. లేదంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఇలానే వుంటాయి. ఒక్కరాష్ట్రం ఫలితాలు దేశం మొత్తం ప్రభావం చూపకపోయినా కొంతమేర ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కడా మరింత బాధ్యతతో వ్యవహరించాలి. హామీలు అమలు పరచాలి. కుర్చీల కుమ్ములాటలు మాని సమైఖ్యంగా సమర్దవంతంగా సుస్దిరమైన శాంతిభద్రలతో కూడిన ప్రజారంజక పాలన అందించాలి.