Karnataka: ఇకపై రూ.200లకు మించొద్దు.. సినిమా టికెట్లపై కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
Karnataka: సినిమా ప్రియులకు శుభవార్త. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ గరిష్ట ధరను పన్నులతో కలిపి రూ. 200గా నిర్ణయించింది. ప్రజలకు వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని శుక్రవారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కొన్ని మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ల ధరలు రూ. 600 నుంచి రూ. 1000 వరకు ఉండడంతో సామాన్య ప్రజలు సినిమాలు చూడడానికి ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చడానికి, కర్ణాటక సినిమా (నియంత్రణ) చట్టం, 1964లోని సెక్షన్ 19 కింద కొత్త నిబంధనలు ‘కర్ణాటక సినిమాస్ (నియంత్రణ) (సవరణ) నియమాలు, 2025’ పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ ధర గరిష్టంగా పన్నులతో సహా రూ. 236 వరకు ఉండొచ్చు. ఈ ధర పరిమితి సాధారణ థియేటర్లకే కాకుండా, ఐమ్యాక్స్, 4డీఎక్స్ వంటి స్పెషల్ ఫార్మాట్‌లకు, అలాగే రిక్లైనర్ సీట్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, 75 సీట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ప్రీమియం థియేటర్లకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇది చిన్న థియేటర్ల యజమానులకు కొంత ఊరట కలిగిస్తుంది.
ఈ ముసాయిదా నోటిఫికేషన్‌ను జూలై 15, 2025న విడుదల చేసిన తర్వాత, ప్రజలు, థియేటర్ యజమానులు, ఇతర వాటాదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ నిర్ణయం వల్ల సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని, తద్వారా సినిమా పరిశ్రమ కూడా లాభపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో కర్ణాటకలో సినీ ప్రేక్షకులు ఇకపై తక్కువ ఖర్చుతోనే సినిమాలను ఆస్వాదించవచ్చని చెప్పవచ్చు.
