Karnataka Movie Ticket Rates: ‘సినిమా టికెట్ రేట్లు రూ.200కు మించొద్దు’పై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు
Karnataka Movie Ticket Rates: కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను రూ.200లకు మించకుండా పరిమితం చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రభుత్వం నిర్ణయం అమలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరల పరిమితిపై తాత్కాలికంగా ఆంక్షలు తొలగిపోయాయి.
గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం 2025-26 బడ్జెట్ సమావేశాల్లో సినిమా రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసింది. సామాన్య ప్రజలకు కూడా సినిమా వీక్షణం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో, అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో అన్ని షోలకు టికెట్ల ధరను రూ.200లకు పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఆగస్టు నెలలో ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, మల్టీప్లెక్స్ అసోసియేషన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా ‘కాంతార’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ సైతం ఈ అంశంపై కోర్టును ఆశ్రయించింది. టికెట్ల ధరల పరిమితి కారణంగా తమ ఆదాయం తగ్గి, మొత్తం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది చిత్ర నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుందని వాదించింది. మల్టీప్లెక్స్‌లకు నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయని, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఈ పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం, ప్రభుత్వ నిర్ణయం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై తుది తీర్పు వచ్చే వరకు టికెట్ల ధరల పరిమితి అమలు చేయకూడదని ఆదేశించింది. ఈ నిర్ణయం సినీ పరిశ్రమ వర్గాలకు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని సినీ పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.