ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన కార్తికేయ 2 మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్‌డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు తిరుగుండదని మరోసారి నిరూపించింది.
కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక‌్షన్లతో దుమ్మురేపింది. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్‌కు బాలీవుడ్ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రల్లో మెప్పించారు. గత కొన్ని రోజులుగా థియేటర్లలో సందడి చేసి.. తాజాగా ఓటీటీకి వచ్చింది కార్తికేయ 2.
ఓటీటీలోనూ తన హవా కొనసాగిస్తుంది కార్తికేయ-2. దసరా సందర్భంగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. కృష్ణతత్త్వం నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగు కంటే హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే..