Keerthy Suresh: నిజంగా నేను అలా ఫోజులిచ్చానా? అనిపించింది.. ఏఐ మార్ఫింగ్ ఫోటోలపై కీర్తి సురేష్ ఆవేదన!
Keerthy Suresh: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరిగాక, సెలబ్రిటీల తలనొప్పులు రెట్టింపయ్యాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు ‘డీప్‌ఫేక్’ బారిన పడగా, తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా ఈ జాబితాలో చేరారు. తన పేరుతో, తన ముఖంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలపై కీర్తి సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫేక్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న నా AI మార్ఫింగ్ ఫోటోలు చూసి నాకు చాలా బాధేసింది, అలాగే విపరీతమైన విసుగు కూడా వచ్చింది. ఆ ఫోటోలు ఎంత పర్ఫెక్ట్‌గా, సహజంగా క్రియేట్ చేశారంటే.. వాటిని చూసినప్పుడు ఒక క్షణం నాకే సందేహం వచ్చింది. నిజంగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఫోటోలకు ఫోజులిచ్చానా? అని నాకు నేనే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు AI టెక్నాలజీ ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో” అని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం తన ఆవేదనను వెల్లడించడమే కాకుండా కీర్తి సురేష్ ఒక సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేశారు. ఈ సమస్య ఈ రోజు సెలబ్రిటీలకు వచ్చిందని, రేపు సామాన్య ప్రజలకు రాదని గ్యారెంటీ లేదని ఆమె హెచ్చరించారు. “మన అనుమతి లేకుండా మన ఫోటోలను ఇలా వక్రీకరించే వారిపై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉండే ప్రతి ఒక్కరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఈ టెక్నాలజీని నియంత్రించడం రోజురోజుకూ కష్టంగా మారుతోంది” అని ఆమె పేర్కొన్నారు.
కీర్తి సురేష్ వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ నటి, గాయని ఆండ్రియా జెరెమియా కూడా గళం విప్పారు. టెక్నాలజీ అనేది మనిషికి ఉపయోగపడాలి కానీ, ఇలా ఇబ్బంది పెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరోయిన్ సమంత, కత్రినా కైఫ్ వంటి వారు కూడా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కీర్తి సురేష్ ఉదంతంతో మరోసారి సైబర్ చట్టాల ఆవశ్యకతపై చర్చ మొదలైంది.
