Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు మెగా ఛాన్స్.. సుకుమార్ నిర్మాణంలో మాస్ ఎంటర్టైనర్!
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇటీవల “క” సినిమాతో మంచి విజయాన్ని అందుకుని వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవకాశం లభించిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం త్వరలో ఒక మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నారని సమాచారం.
సాధారణంగా దర్శకుడు సుకుమార్, తన సొంత బ్యానర్ ‘సుకుమార్ రైటింగ్స్’ ద్వారా కొత్త దర్శకులను, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలో, సుకుమార్ శిష్యుడైన వీర దర్శకత్వంలో రూపొందనున్న ఒక చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘కె-ర్యాంప్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలతో పాటు, సుకుమార్ వంటి అగ్ర దర్శకుడి బ్యానర్‌లో సినిమా చేయడం కిరణ్ అబ్బవరం కెరీర్‌కు ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కిరణ్ అబ్బవరం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడం ఖాయం.
మరోవైపు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్‌తో పాటు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా, ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న ఈ సినిమా, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.