Kishkindhapuri: గుండె ధైర్యం ఉన్నవాళ్లే మా సినిమాకు రండి, పిల్లలు రావొద్దు: ‘కిష్కిందపురి’ మూవీ టీమ్
Kishkindhapuri: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా ‘ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ సందర్భంగా, సినిమా యూనిట్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పిల్లలకు ఈ సినిమాలో ప్రవేశం లేదని, అలాగే గుండె ధైర్యం లేనివారు థియేటర్‌కు రావద్దని కూడా విజ్ఞప్తి చేసింది.
‘చావు కబురు చల్లగా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్, ఈసారి హారర్ జానర్‌ను ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి. “ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన… కిష్కిందపురి ప్రేతాత్మ” అంటూ సాగే డైలాగులు, దెయ్యాల భవంతి, ఒంటరి అడవి వంటి భయానక వాతావరణం ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో, దెయ్యాలపై ఆసక్తి ఉన్న కొందరు యువకులు ఒక పాడుబడిన భవంతికి వెళ్ళిన తర్వాత ఎదురయ్యే భయానక అనుభవాలను చూపిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో అనుపమ దెయ్యంగా మారడం, ఆమెను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
https://x.com/Shine_Screens/status/1963851922563309683
ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. గతంలో ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రంలో కలిసి నటించిన ఈ జోడి, ఈసారి ‘కిష్కిందపురి’తో మరో విజయాన్ని సాధిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.