KL Rahul Kantara: ‘కాంతార ఛాప్టర్ 1’ మ్యాజిక్‌కు కేఎల్ రాహుల్ ఫిదా.. రిషబ్‌పై స్పెషల్ పోస్ట్
KL Rahul Kantara: కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ఆదరణనూ చూరగొంది. తాజాగా, టీమిండియా స్టార్ బ్యాటర్, క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
కేఎల్ రాహుల్ మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. తన సొంత ప్రాంత సంస్కృతి, నమ్మకాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా చూసి ఆయన ఎంతగానో ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాహుల్ ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు.
“కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. మరోసారి రిషబ్ శెట్టి తన అద్భుతమైన ప్రతిభతో మేజిక్ చేశారు. మంగళూరు ప్రజల యొక్క బలమైన నమ్మకాన్ని, మూలాలను తెరపై ఇంత అద్భుతంగా చూపించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇది నిజంగా గొప్ప సినిమా,” అంటూ రాహుల్ రాసుకొచ్చారు.
ఒక జాతీయ స్థాయి క్రికెటర్, మంగళూరు ప్రాంతవాసి అయిన కేఎల్ రాహుల్ నుండి అభినందనలు రావడంపై ‘కాంతార’ చిత్ర యూనిట్ ఉప్పొంగిపోయింది. నిర్మాణ సంస్థ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ, “ఇది చూశాక మాకు ఎంతో గర్వంగా ఉంది. చిత్ర బృందం అందరికీ ఇది నిజంగా ఒక విన్నింగ్ మూమెంట్. కేఎల్ రాహుల్‌కు మా ధన్యవాదాలు,” అని పేర్కొంది.
నిజానికి, కేఎల్ రాహుల్‌కు ‘కాంతార’ సినిమా అంటే ఎంత ఇష్టమో గతంలోనే స్పష్టమైంది. గతంలో ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన తర్వాత రాహుల్ చేసిన సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ వేడుకల గురించి రాహుల్ స్పందిస్తూ, “నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటైన ‘కాంతార’ స్ఫూర్తితోనే ఆ సెలబ్రేషన్స్ చేశాను. నేను ఇక్కడ (మంగళూరు ప్రాంతంలో) ఆడుతూ, పెరుగుతూ వచ్చానని ప్రపంచానికి చెప్పడమే నా సెలబ్రేషన్స్ ఉద్దేశం,” అని తెలిపారు. ఇప్పుడు ఆయన ‘కాంతార చాప్టర్ 1’ను ప్రశంసించడంతో, ఈ సినిమాపై ఆయనకున్న అభిమానం మరోసారి నిరూపితమైంది.