Kotha Lokah: 30 కోట్లతో 300 కోట్ల సినిమా.. “లోక చాప్టర్ 1: చంద్ర”పై డైరెక్టర్ వెంకీ అట్లూరి కామెంట్స్
Kotha Lokah: యువ నటి కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ సూపర్ హీరో చిత్రం “లోక చాప్టర్ 1: చంద్ర” థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన తర్వాత, ఇటీవలే తెలుగులోకి అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఈ సందర్భంగా, సినిమా సాధించిన సక్సెస్‌కు గుర్తుగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తమ మూవీ సక్సెస్ పట్ల యూనిట్ ఈవెంట్‌లో ఆనందం వ్యక్తం చేసింది. సినిమా నిర్మాత దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, “ఈ సినిమా తెలుగులో ఒక చిన్న చిత్రంగా కనిపించవచ్చు. కానీ, మలయాళంలో దీనికి పెట్టిన బడ్జెట్ చాలా ఎక్కువ. ఈ ప్రాజెక్ట్‌ను మేమందరం ఒక కలగా భావించి పని చేశాం. ఈ కథను మొదటిసారి విన్నప్పుడు, ‘చంద్ర’ పాత్రకు కల్యాణి ప్రియదర్శన్ తప్ప మరెవరూ సరిపోరనిపించింది. ఆమె అద్భుతంగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. “కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో 300 కోట్ల స్థాయి సినిమా తీశారని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇది నిజంగా అసాధారణమైన విజయం” అని ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, “కల్యాణిని ఒకసారి కలిసినప్పుడు ఆమె ఒక చిన్న మలయాళం సినిమా చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు చూస్తే, ఆ సినిమా భారీ పోస్టర్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం సాధించిన విజయం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరిలాగే, నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.
చిత్రం విజయవంతం కావడానికి కారణమైన తెలుగు ప్రేక్షకులకు నటి కల్యాణి ప్రియదర్శన్ ధన్యవాదాలు తెలిపారు. “మీరు మా చిత్రాన్ని తెలుగు సినిమా లాగా భావించి ఇంతటి అద్భుతమైన ఆదరణ చూపించడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని ఆమె అన్నారు. ఈ వేడుకలో నస్లెన్, జేక్స్ బిజోయ్, ఇతర చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.
