Krrish 4: హృతిక్ డైరెక్షన్‌లో ‘క్రిష్ 4’.. కొలిక్కి వచ్చిన మూవీ బడ్జెట్..
Krrish 4: బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, నాలుగో భాగం ‘క్రిష్ 4’పై తాజాగా కీలక అప్‌డేట్ విడుదలైంది. ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ‘క్రిష్’, ‘క్రిష్ 3’ చిత్రాలు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో త్వరలో రానున్న నాలుగో భాగానికి స్వయంగా హృతిక్ రోషనే దర్శకత్వం వహించనున్నారు. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌పై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేశ్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
గతంలో భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతోందని రాకేశ్ రోషన్ వెల్లడించారు. కథను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించాలని, కానీ బడ్జెట్ తగ్గించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “కథ రాయడానికి ఎక్కువ సమయం పట్టలేదు, కానీ బడ్జెట్ గురించే ఒత్తిడి ఎదురైంది. ఇప్పుడు ‘క్రిష్ 4’ సినిమాకు ఎంత ఖర్చవుతుందనే దానిపై మాకు స్పష్టత వచ్చింది,” అని అన్నారు.
ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, దీనికి ఎక్కువ సమయం పడుతుందని రాకేశ్ తెలిపారు. “వచ్చే ఏడాది మధ్యలో చిత్రీకరణ ప్రారంభిస్తాం, 2027లో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను హృతిక్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లుగా గతంలోనే రాకేశ్ రోషన్ ప్రకటించారు. దీంతో ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఆయన స్థానంలో హృతిక్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ వార్త హృతిక్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సిరీస్‌లో ‘కోయ్ మిల్ గయా’ (2003), ‘క్రిష్’ (2006), ‘క్రిష్ 3’ (2013) చిత్రాలు ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించాయి.