ఏపీలో 2022-23 సంవత్సరంలో కూడా రిటైల్ మద్యం విక్రయాల విధానానికే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దశల వారీగా మద్యపాన నిషేధం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామనే నినాదం ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసినట్టే కనిపిస్తోంది. ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ బాండ్ల ద్వారా వేల కోట్ల రుపాయల బాండ్లు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది రిటైల్ విక్రయాలను కొనసాగించాలని నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2934 రిటైల్ మద్యం దుకాణాల్లో భారత్ లో తయారైన విదేశీ మద్యం విక్రయాలకు అనుమతించనున్నారు. అలాగే బెల్ట్ దుకాణాల తొలగింపు తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 2022 అక్టోబర్ 1 తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకూ ఈ మద్యం విధానం అమల్లో ఉంటుదని తెలిపింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
