సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్ లో యథేచ్ఛగామద్యం అమ్మకాలు సాగుతున్నాయి . మరీ దారుణంగా నడిరోడ్డు మీదే మద్యం.. బాబు.. మద్యం అంటూ బైక్‌పై మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు కొందరు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో సంచలనం గా మారింది.
బీజేపీ నుండి కటీఫ్ అయ్యాక మళ్ళీ కొత్తగా సీఎం బాధ్యతలు తీసుకున్న నితిష్ కుమార్ సర్కార్ విమర్శలపాలు అవుతుంది. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ రామ్ విలాస్ పాశ్వాన్ బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానని బోర్డు పెట్టుకుని బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించామంటున్న నితీష్ కుమార్ ప్రభుత్వ మాటలు పచ్చి అబద్ధాలు అంటూ పాశ్వాన్ ఖండించారు.
నితీష్ గవర్నమెంట్ తీరుని ఎండగడుతూ పాశ్వాన్ సోషల్ మీడియా లో హిందీలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఈ విధంగా ఉంది “సీఎం నితీష్ కుమార్ మీ దృష్టి అంతా ప్రధానమంత్రి కుర్చీపై ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ మీరు ఇక్కడ బీహార్ లో కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండేవి. బీహార్‌లో మద్యం బహిరంగంగా ఎలా సరఫరా అవుతుందో ఒకసారి చూడండి. మీ పోలీసులు ఎలా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారో చుడండి.” అంటూ ట్వీట్ చేసారు పాశ్వాన్.
2016 నుండి బీహార్ లో మద్యపాన నిషేధం అమలు:
2016 ఏప్రిల్ నుండి బీహార్‌లో సంపూర్ణ మద్యపానం నిషేధం అమల్లో ఉంది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా మద్యం తాగితే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ జీవో అమలు లోకి రాగానే దీనికి సంబంధించి పెద్ద మొత్తం లో కేసులు పెండింగ్‌లో ఉండడంతో,మద్యపాన నిషేధ చట్టానికి ఇటీవల కొన్ని సవరణలు చేశారు. ఈ సవరణలు కూడా నితీష్ కుమార్ సర్కార్ మీద విమర్శలకి అవకాశం ఇచ్చింది.