Little Hearts: ఓటీటీలోకి వచ్చేసిన లిటిల్ హార్ట్స్.. మరికొన్ని కామెడీ సీన్లతో నవ్వులే నవ్వులు..
Little Hearts: చిన్న సినిమాగా విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్‌లు, యాక్షన్ సన్నివేశాలు లేకుండా కేవలం ₹2.5 కోట్లతో రూపొందించబడిన ఈ సినిమా, ఏకంగా ₹40 కోట్లకు పైగా వసూళ్లు చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌తో పాటు, ప్రముఖ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్, బండ్ల గణేశ్ వంటి స్టార్ నటులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
యూట్యూబ్ ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు మౌళి తనూజ్ ఈ చిత్రంలో హీరోగా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన సరసన శివాని నాగారం హీరోయిన్‌గా నటించి సినీరంగంలో అడుగుపెట్టారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈటీవీ విన్, బన్నీ వాస్ సమర్పణలో ఈ సినిమా విడుదలైంది.
థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం, అక్టోబర్ 1 నుండి ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ వెర్షన్‌లో లేని కొన్ని అదనపు కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ఓటీటీ వెర్షన్‌లో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. మృదువైన ప్రేమకథ, హాస్యం, భావోద్వేగాల కలయికగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు.