Little Hearts: ఓటీటీలోకి ‘లిటిల్ హార్ట్స్’.. ఏ ఓటీటీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Little Hearts: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై, యూత్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ సాధించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి సీనియర్ నటులు కూడా ముఖ్య పాత్రలు పోషించి కథకు బలాన్నిచ్చారు. సరళమైన కథనం, యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లను సాధించింది.
థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటం మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు శుభవార్త చెప్పింది మూవీ టీమ్. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన ఈటీవీ విన్ (ETV Win) ద్వారా డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా, ఓటీటీ విడుదలను సూచిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
సినిమా థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ చిత్రం అదే స్థాయి ఆదరణ పొందుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిత్రాలకు దక్కుతున్న ఈ విజయం, టాలీవుడ్‌లో కొత్త కంటెంట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించింది.
చిన్న సినిమాగా విడుదలై అసాధారణ విజయం అందుకున్న లిటిల్ హార్ట్స్ పై ప్రముఖులు సైతం స్పందించారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అది కూడా అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించడంపై హీరో నాని, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి వారు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.
https://x.com/etvwin/status/1971570811669745733