Laalo Krishna Sada Sahaayate: బ్లాక్‌బస్టర్ బంపర్ హిట్‌గా ‘లాలో’ మూవీ.. రూ.50 లక్షలతో సినిమా.. రూ.100 కోట్ల వసూళ్లు
Laalo Krishna Sada Sahaayate: భారీ బడ్జెట్, నటీనటులు, హంగుల కన్నా కథలో సత్తా ఉంటేనే ఒక సినిమా ఘన విజయం సాధిస్తుందని మరోసారి నిరూపించింది గుజరాతీ చిత్రం ‘లాలో-కృష్ణ సదా సహాయతే’. కేవలం రూ. 50 లక్షల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఎలాంటి భారీ ప్రచార ఆర్భాటం లేకుండానే ప్రేక్షకులకు చేరువై, త్వరలో రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంటెంట్ ఆధారంగానే విజయం సాధించవచ్చని నిరూపించిన ఈ చిత్రం ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది.
‘లాలో-కృష్ణ సదా సహాయతే’ చిత్రం కథ, ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ, గత విషయాలకు బాధపడుతున్న ఓ ఆటో డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. అనుకోకుండా ఓ ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోయిన అతనికి, మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తాడు. ఆటో డ్రైవర్, కృష్ణుడు స్నేహంగా మారి, కృష్ణుడి లీలల సహాయంతో ఆ డ్రైవర్ తన మనసులోని అలజడి, గతం తాలూకూ బాధలను అధిగమించి కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా ప్రయాణించడమే ఈ సినిమా ముఖ్య కథాంశం. దర్శకుడు అంకిత్ సఖియా ఈ చిత్రంలో మానవుడి పోరాటానికి దైవ సహాయం తోడైతే ఎలా ఉంటుందనే అద్భుతమైన కాన్సెప్ట్‌ను చూపించారు.
అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమాకు తొలి వారం ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నా మౌత్ టాక్ అస్త్రంగా మారి అద్భుతాలు సృష్టించింది. సినిమా బాగుందనే టాక్ పెరగడంతో, రెండో వారం నుంచి ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 75 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు ఊహించని లాభాలను అందించింది. ప్రస్తుతం ఏడో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన ఈ చిత్రం, రూ. 100 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
గతంలో గుజరాతీ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు (సుమారు రూ. 50 కోట్లు) సాధించిన ‘చాల్ జీవీ లాయియే’ (2019) రికార్డును ‘లాలో’ అధిగమించింది. రూ. 100 కోట్లు సాధించిన మొదటి గుజరాతీ సినిమాగా నిలిచేందుకు ఇది సిద్ధంగా ఉండటం విశేషం.
ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత మానసి పరేఖ్ (70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు విజేత) పార్థివ్ గోహిల్తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో శ్రుహద్ గోస్వామి నటన ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఆటో డ్రైవర్‌గా కరణ్ జోషి, ఆయన భార్యగా రీవా రచ్ నటించారు. ‘లాలో’ సాధించిన ఈ అసాధారణ విజయం భారతీయ చలన చిత్ర వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషా ప్రేక్షకులను కూడా అలరించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
