Varanasi: రాజమౌళి – మహేష్ ‘వారణాసి’లో హనుమంతుడిగా ఆ స్టార్ హీరో?.. లీకైన ఇంట్రెస్టింగ్ న్యూస్!
Varanasi: భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌లో ఇప్పటికే భారీ తారాగణం భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో విలక్షణ నటుడు ఆర్. మాధవన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఆయన పాత్ర సాధారణంగా ఉండదని, మైథాలజీ టచ్‌తో ఉంటుందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మాధవన్ ఈ చిత్రంలో ‘హనుమంతుడి’ తరహా పాత్రలో లేదా హనుమంతుడిని పోలిన పాత్రలో కనిపించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ‘కుంభ’ కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను, హీరోయిన్ ‘మందకిని’ పాత్ర కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ఫస్ట్ లుక్స్‌పై కూడా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రామాయణ ఘట్టం చాలా కీలకంగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందట. ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో మహేష్ బాబు సాక్షాత్తు శ్రీరాముడిగా కనిపిస్తారని, ఆయనకు తోడుగా మాధవన్ హనుమంతుడి పాత్రలో మెరుస్తారని తెలుస్తోంది.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే మరో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ వార్తలే గనుక నిజమైతే.. మహేష్ బాబు, రాజమౌళి, మాధవన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
