Mahavatar Narasimha: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేషన్ మూవీ..!
Mahavatar Narasimha: ఎలాంటి అంచనాలు, ప్రచార ఆర్భాటాలు, ప్రమోషన్లు, పబ్లిసిటీ స్టంట్లు ఏవీ లేకుండా సైలెంట్‌గా వచ్చి చాలా వయోలెంట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది ఓ యానిమేషన్ మూవీ. అదే ‘మహావతార్ నరసింహా’. ప్రస్తుతం థియేటర్లలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు సందడి చేస్తున్నా.. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ప్రతి షో హౌజ్‌ఫుల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పౌరాణిక యానిమేటెడ్ చిత్రం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మౌత్ టాక్‌తో అనూహ్య విజయం దిశగా దూసుకెళ్తోంది. పెద్ద సినిమాలకు సైతం గట్టి పోటీనిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అంచనాలను మించిన ఆదరణ..
సాధారణంగా పెద్ద సినిమాలు భారీ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తాయి. కానీ ‘మహావతార్ నరసింహ’ మూవీ టీమ్ ఎలాంటి ప్రమోషన్లు లేకుండా నేరుగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో వారు వేసిన ఈ అడుగుకు అసాధారణ ఫలితం లభించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వస్తోంది. దీంతో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో కూడా థియేటర్లు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ-బుకింగ్స్ ఊపందుకున్నాయి.
వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు..
విడుదలైన తొలి వారంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 53 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం మౌత్ టాక్‌తో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఒక రికార్డు. ఇదే జోరు కొనసాగితే, లాంగ్ రన్‌లో ఈ చిత్రం సునాయాసంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ విజన్, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిసి ఈ చిత్రానికి ప్రాణం పోశాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.