Mahavatar Narsimha: ‘మహావతార్ నరసింహ’ సినిమా పవర్‌ఫుల్ విజన్.. !
Mahavatar Narsimha: ప్రస్తుతం భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద పౌరాణిక కథలకు విశేష ఆదరణ లభిస్తోంది. పాత కథలనే సరికొత్తగా, ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందిస్తే వారు బ్రహ్మరథం పడతారని ఇటీవల విడుదలైన పలు చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు ఇదే కోవలో ‘మహావతార్ నరసింహ’ దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ విజువల్ వండర్, అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 3డీ అనుభవం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
‘మహావతార్ నరసింహ’ ఒక పవర్‌ఫుల్ విజన్: ప్రభాస్
‘మహావతార్ నరసింహ’ చిత్రంపై అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. “పవర్‌ఫుల్ విజన్‌తో ‘మహావతార్ నరసింహ’ను తెరపైకి తీసుకొచ్చిన హోంబలే ఫిలిమ్స్‌కు నా శుభాకాంక్షలు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. యానిమేషన్ రూపంలో రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, కథనం అద్భుతంగా ఉన్నాయి. ఈ అపురూప విజయం సాధించిన దర్శకుడు అశ్విన్ కుమార్, చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు” అని ప్రభాస్ పేర్కొన్నారు. ప్రభాస్ పోస్ట్‌కు హోంబలే చిత్ర బృందం స్పందిస్తూ, సినిమాపై ఆయన అభిప్రాయానికి కృతజ్ఞతలు తెలిపింది.
హిందీలో అద్భుతమైన వసూళ్లు..
పౌరాణిక కథలు హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో ‘కార్తికేయ 2’, ‘కాంతార’ వంటి చిత్రాలు హిందీలో భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ‘మహావతార్ నరసింహ’ కూడా అదే మార్గంలో పయనిస్తూ థియేటర్ల వద్ద జనాలను క్యూ కట్టేలా చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం నికరంగా రూ. 14.70 కోట్లు వసూలు చేసింది.
తొలి రోజు హిందీలో కేవలం రూ. 1.40 కోట్లు వసూలు చేయగా.. శనివారం నాటికి రూ. 3.20 కోట్లకు చేరుకుంది. ఆదివారం పలు థియేటర్లలో టికెట్లు దొరకడమే కష్టంగా మారింది. ఆ ఒక్క రోజునే ఏకంగా రూ. 6.50 కోట్లు వసూలు చేసింది. మన పురాణాలను సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్‌తో వెండితెరపై ఆవిష్కరిస్తుండటంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను థియేటర్లకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందడంతో, 3డీ వెర్షన్‌కు డిమాండ్ తారస్థాయిలో ఉంది.