Mahavatar Narasimha: మహావతార్ నరసింహా కోసం ఆస్తులన్నీ అమ్మేసిన నిర్మాత.. కట్ చేస్తే..
Mahavatar Narasimha: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో యానిమేషన్ సినిమాలు విజయం సాధించడం అరుదు. అయితే, ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహ’ చిత్రం. రూ.40 కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ ప్రాజెక్ట్, నేడు రూ.282 కోట్ల లాభాలను ఆర్జించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ అద్భుతమైన విజయానికి వెనుక దాగి ఉన్న కష్టాలు, సవాళ్లు, అంకితభావం గురించి ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
ఆలోచన నుంచి అద్భుత విజయం వరకు
మహారాష్ట్రలోని థానేకు చెందిన శివమ్ ధావన్, ఆయన భార్య శిల్పా ధావన్‌ల కలల ప్రాజెక్ట్ ‘మహావతార్ నరసింహ’. ఒకప్పుడు నాస్తికుడైన శివమ్, భగవద్గీత, శ్రీల ప్రభుపాద రచనల ప్రభావంతో కృష్ణ భక్తుడిగా మారి, ప్రహ్లాదుడు-నరసింహస్వామి కథను 3డీ యానిమేషన్‌లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. వీఎఫ్ఎక్స్, డిజిటల్ పెయింటింగ్‌లో అపార అనుభవం ఉన్న శివమ్… మెక్‌డొనాల్డ్స్, మారుతి వంటి దిగ్గజ సంస్థలకు పనిచేశారు. తనకున్న నైపుణ్యంతో, ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మొదట్లో తమ వద్ద ఉన్న డబ్బు సరిపోతుందనుకున్నా, ప్రాజెక్ట్ ముందుకు సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలకు మించి పెరిగింది.
2డీ యానిమేషన్‌లో ఒక క్షణానికి 24 చిత్రాలు గీస్తే సరిపోతుంది. కానీ, 3డీ యానిమేషన్‌లో ఆ 24 చిత్రాల సెట్‌ను సృష్టించడానికి ఒక్కోసారి వారం పట్టవచ్చని శివమ్ వివరించారు. ఒక ఐదు నిమిషాల సీన్ సరిగ్గా రాకపోతే, దాన్ని మళ్లీ రీ-షూట్ చేయడానికి కొన్ని నెలలు పట్టేది. ఈ ప్రక్రియలో ఖర్చు భారీగా పెరిగింది.
ఒకవైపు శివమ్, అతని బృందం రోజుకు 16 గంటలు కష్టపడితే, మరోవైపు శిల్పా ధావన్ జీతాలు, లోన్లు, వడ్డీల కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. తమకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కారు, నగలు, చివరకు తమ ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. వారి నమ్మకం వమ్ము కాలేదు. ముంబైకి చెందిన అపర్ గ్రూప్ సహ-నిర్మాతలుగా చేరగా, కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలె ఫిల్మ్స్ మార్కెటింగ్ బాధ్యతలు తీసుకుంది.
జూలై 25న విడుదలైన ‘మహావతార్ నరసింహ’ చిత్రం బాలబాలికలనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి పది రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రూ.282 కోట్లకు పైగా వసూళ్లతో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.