Mahavatar Narsimha: రికార్డుల మోత మోగిస్తున్న ‘మహావతార్ నరసింహ’… రూ.300 కోట్లు వసూలు!
Mahavatar Narsimha: భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలకు కొత్త ఊపు తెచ్చిన సినిమా ‘మహావతార్ నరసింహ’. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటించింది.
యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమే అనే అభిప్రాయాన్ని ఈ చిత్రం పూర్తిగా చెరిపివేసింది. దర్శకుడు అశ్విన్ కుమార్ పట్టుదల, విజన్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఒకప్పుడు యానిమేషన్ సినిమా తీస్తానంటే నవ్విన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. సుమారు నాలుగేళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, చివరికి హోంబలే ఫిలింస్ మద్దతుతో ₹40 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది.
‘మహావతార్ నరసింహ’ విడుదలైన 30 రోజులు దాటినా ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇది ఒక అరుదైన విజయం. కేవలం 8 రోజుల్లోనే ₹60.5 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ యానిమేషన్ మూవీగా రికార్డు నెలకొల్పింది. విజువల్స్ పరంగా సినిమా చూసిన ప్రేక్షకులు అచ్చం నరసింహ స్వామే ప్రత్యక్షమయ్యాడా అన్నంత అనుభూతిని పొందారు.
ఈ సినిమా విజయం సాధించడంతో ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా మరో ఏడు సినిమాలు రానున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒక సినిమా చొప్పున ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా విజయంతో భారతీయ సినీ పరిశ్రమలో యానిమేషన్ చిత్రాల భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి.