Mahavatar Narsimha: మహావతార్ నరసింహా మూవీ చూసిన చాగంటి.. సినిమాపై ఏమన్నారంటే?
Mahavatar Narsimha: థియేటర్లలో పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలై, కేవలం మౌత్ టాక్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న పౌరాణిక యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం జూలై 25న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాను చూసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి సినిమా వీక్షించిన చాగంటి కోటేశ్వరరావు, చిత్రబృందాన్ని ప్రశంసించారు. “భక్త ప్రహ్లాద వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచి ఉన్నాయి. అదే తరహాలో, బొమ్మలతో రూపొందించినప్పటికీ ‘మహావతార్ నరసింహా’ చిత్రంలో నిజంగా నరసింహుడిని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం ఇది” అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోను గీతా ఆర్ట్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో, ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాగంటితో పాటు శాంతా బయోటిక్స్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి కూడా సినిమాను చూసి, చిత్రబృందాన్ని అభినందించారు.
దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ యానిమేషన్ చిత్రం ఇప్పటికే రూ.230 కోట్లకు పైగా వసూలు చేసి, బాక్సాఫీస్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పెద్ద బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు విడుదలైనా, ఈ సినిమా కలెక్షన్లకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని, ఇది భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
https://x.com/GeethaArts/status/1956302429793980583
‘మహావతార్ నర్సింహా’ చిత్ర బృందాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభినందించిన విషయం తెలిసిందే. “భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను పరిరక్షించేందుకు మీరు చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొంది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు, క్లీమ్ ప్రొడక్షన్స్ సహకారంతో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇది విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో తొలి భాగం.