Mahesh Babu: రాజమౌళి ‘వారణాసి’ తర్వాత.. ఆ క్రేజీ డైరెక్టర్‌తోనే మహేష్ సినిమా!
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’తో ఆయన గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. పౌరాణిక నేపథ్యంతో, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉండగా, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తీసుకోబోయే నిర్ణయంపై సినీ అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని, మహేష్ తన తదుపరి కెరీర్ ప్లాన్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
గతంలో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా – మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే తాజాగా ఆ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, మహేష్‌ను కలిసి గతంలో తాను చెప్పిన కథనే మళ్లీ డెవలప్ చేసి వినిపించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఆ కథను వివరంగా చర్చించారని, ఆ కథ మహేష్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్గా సరిపోతుందని భావించినట్లు సమాచారం.
దీంతో సందీప్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జోరుగా టాక్ నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’పైనే అత్యంత భారీ అంచనాలు ఉండగా, దాని వెంటనే వంగాతో సినిమా కన్ఫర్మ్ అయితే, మహేష్ బాబు కెరీర్లో ఇవి బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లు కావడం ఖాయం. సందీప్ రెడ్డి వంగా హిట్టిచ్చిన దర్శకుడే అయినప్పటికీ, మహేష్ లాంటి సూపర్ స్టార్ కోసం కథను మలచడం, రాజమౌళి సినిమా తర్వాత ఆ అంచనాలను అందుకోవడం ఒక పెద్ద సవాలే అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, మహేష్ బాబు కెరీర్ పరంగా రాబోయే రోజులు మరింత ఉజ్వలంగా ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు.
