Varanasi: ఒకే ఫ్రేమ్‌లో రుద్ర, మందాకిని, కుంభ.. వారణాసి యాక్టర్ల సెల్ఫీ వైరల్
Varanasi: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక తాజా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ నటి, అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మాలీవుడ్ అగ్ర నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ ముగ్గురు స్టార్ నటీనటులు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో ‘వారణాసి’ సినిమా గురించి ప్రత్యేకంగా చిట్‌చాట్ చేశారు. ఈ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి దిగిన సెల్ఫీని మహేష్ బాబు టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
“ప్రపంచమంతా చుట్టేయబోతున్న కథలోని ముఖాలు.. ముగ్గురి కలయికలో డిఫరెంట్ హిట్ ఉండబోతుంది” అంటూ ఇచ్చిన క్యాప్షన్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది. ఇటీవల నిర్వహించిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో లాంచ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మహేష్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని, నందిపై స్వారీ చేస్తున్న విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. ఫారెస్ట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఈ సెల్ఫీ మరింత పెంచిందని చెప్పవచ్చు.
