Manchu Lakshmi: “మా కుటుంబం మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకుంటా”.. మంచు లక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్
Manchu Lakshmi: సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాల గురించి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. తమ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న అంతర్గత వివాదాలు తనను ఎంతగానో కలచివేశాయని ఆమె వెల్లడించారు. ఈ గొడవలు తమ కుటుంబంలో వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని, అవి చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.
సాధారణంగా సినిమాల ప్రమోషన్లలో తప్ప, వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మంచు లక్ష్మి ఆసక్తి చూపరు. అయితే, ఈ పాడ్‌కాస్ట్‌లో ఆమె తన వివిధ బాధ్యతలను గురించి మాట్లాడుతూ… ఒక తల్లిగా, సోదరిగా, కుమార్తెగా ఉన్నా, తల్లి పాత్రకే తాను 10కి 10 మార్కులు వేసుకుంటానని పేర్కొన్నారు.
కుటుంబ కలహాల గురించి మాట్లాడుతూ మంచు లక్ష్మి తన ఆవేదనను వ్యక్తం చేశారు. “దేవుడు నాకు కనిపించి, ఒక వరం కోరుకోమంటే… మా కుటుంబమంతా మళ్లీ ఒకేతాటిపైకి వచ్చి, గతంలో మాదిరిగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటాను. అన్ని కుటుంబాల్లోనూ గొడవలు వస్తూ ఉంటాయి. కానీ, చివరికి ఆ వివాదాలన్నీ సమసిపోయి అందరూ ఒక్కటవ్వాలి. మన దేశీయ కుటుంబాల్లో కొన్నిసార్లు చిన్న గొడవలు జరిగినా జీవితాంతం కలవకూడదని నిర్ణయించుకుంటారు. కానీ, చివరకు మనకు మిగిలేది రక్త సంబంధీకులు మాత్రమే అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని ఆమె సూచించారు.
కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎన్ని పోరాటాలైనా చేయాలని, అంతేకానీ దూరాన్ని పెంచుకోకూడదని ఆమె గట్టిగా చెప్పారు. వివాదాల సమయంలో తాను ముంబైలో ఉన్నందున, ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై తనకు బాధ లేదని కొందరు వార్తలు రాశారని మంచు లక్ష్మి పేర్కొన్నారు. “నేను ఎంతటి బాధను అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు. నేను ఆ వివాదంపై స్పందించలేదు కాబట్టి, వారికి నచ్చిన విధంగా ఊహాగానాలు సృష్టించారు. ఇది నా వ్యక్తిగత విషయం. నా కుటుంబం గురించి నేను ఏమనుకుంటున్నానో, ఆ గొడవల వల్ల నేను ఎంత బాధపడ్డానో బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని భావించాను” అని ఆమె తమ మౌనం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలు మంచు ఫ్యామిలీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
