Manoj Bajpayee: ‘మధుకర్ జెండే సీక్రెట్ మిషన్ ప్రారంభమైంది.. ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ రిలీజ్ ఎప్పుడంటే?
Manoj Bajpayee: బహుముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ సెప్టెంబర్ నెలలో తన అభిమానులకు రెండు విభిన్నమైన సినిమాలతో వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ అలాగే గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ది ఫేబుల్’ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి.
‘ఇన్‌స్పెక్టర్ జెండే’ – నవ్వుల వెనుక సీరియస్ కథ
ఓం రౌత్ నిర్మాణంలో చిన్మయ్ మండేక్లర్ దర్శకత్వం వహించిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మనోజ్ బాజ్‌పేయి తన పాత్ర గురించి మాట్లాడుతూ, “ఎంత విషపూరితమైన పాము అయినా సరే, ముంగిస దెబ్బకు కిందపడాల్సిందే. నేను కూడా అలాంటి వ్యక్తినే,” అంటూ తన పాత్రలోని బలాన్ని పరోక్షంగా వెల్లడించారు. జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, స్విమ్‌సూట్ కిల్లర్‌గా పేరుగాంచిన కార్ల్ భోజ్‌రాజ్‌ను పట్టుకున్న పోలీసు అధికారి మధుకర్ జెండే నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ట్రైలర్ ఆసక్తికరమైన సంభాషణలు, నవ్వులు పంచుతూ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘ది ఫేబుల్’ – హృదయాన్ని తాకే కథనం
ఇక మనోజ్ బాజ్‌పేయి నటించిన మరో చిత్రం ‘జుగ్నుమా’ (ది ఫేబుల్). రామ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు గునీత్ మోంగా, అనురాగ్ కశ్యప్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గునీత్ మోంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “ఈ చిత్రం నన్ను కలవర పెట్టింది, ఓదార్చింది.
చాలా అద్భుతంగా, ఉన్నతంగా ఉంది. అందుకే మీ అందరికి చూపించడానికి ముందుకొచ్చాను,” అని తెలిపారు. దీపక్ డోబ్రియాల్, ప్రియాంక బోస్, తిలోత్మా వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. రెండు విభిన్నమైన కథాంశాలతో మనోజ్ బాజ్‌పేయి ఈ సెప్టెంబర్ నెలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
