Medico Preethi:ముగిసిన ప్రీతి అంత్యక్రియలు…దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ లో జరిగిన ర్యాగింగ్ ఘటనలో మృతి చెందిన మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు తాజాగా ముగిసాయి. తన సీనియర్ అయిన విద్యార్థి సైఫ్ వేధింపులు తాళలేక ఐదు రోజుల క్రితం ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ప్రీతి స్థానిక నిమ్స్ లో దాదాపు ఐదు రోజులపాటు చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ డెడ్ ద్వారా మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. తాజాగా ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. అలాగే ప్రీతి మృతి పట్ల విపక్షాలు కూడా పెద్ద ఎత్తున అధికారపక్షంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే “నిందితులను వదిలిపెట్టవద్దు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే ఆందోళన విరమిస్తామని బిజెపితో పాటు ఎస్టీ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి.
ఈ క్రమంలో నిరసనలపై తాజాగా ఎర్రబెల్లి స్పందిస్తూ..”ప్రీతి మరణం అత్యంత దురదృష్టకరం బాధాకరం. ఆ కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని ఎవరు పూడ్చలేరు. ప్రీతి మరణం పట్ల సీఎం కేసీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు.ఈ ఘటనలో నిందితులని ఇప్పటికే అరెస్ట్ చేశామని,ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అలాగే ప్రీతి కుటుంబానికి ఇదివరకు ప్రకటించిన పది లక్షల ఎక్స్ గ్రేషియాని 30 లక్షలకి పెంచుతున్నాం” అని తెలిపారు.
దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బీజేపీ, ఎస్టీ సంఘాలు మరియు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ప్రీతి స్వగ్రామమైన వరంగల్ జిల్లాలోని కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రీతి అంత్యక్రియలు ముగిసినప్పటికీ ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి