Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ కాంబోలో మెగాస్టార్ మల్టీస్టారర్ చేయబోతున్నారా?
Chiranjeevi: టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రాన్ని పూర్తి చేసి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు భారీ చిత్రాల తర్వాత మెగాస్టార్ చేయబోయే తదుపరి సినిమాపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
గతంలో ఈ క్రేజీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు చిరు-బాబీ ద్వయం సిద్ధమవుతోంది. అయితే, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్ర పోషించగా, ఈ ఇద్దరు స్టార్ల కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అదే మల్టీస్టారర్ సెంటిమెంట్‌ను తదుపరి ప్రాజెక్ట్‌లోనూ కొనసాగించాలని చిరంజీవి, బాబీ భావిస్తున్నట్లు సమాచారం. రవితేజ తర్వాత, ఈసారి చిరంజీవితో కలిసి మరో సూపర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ప్రచారం ఊపందుకుంది.
ఆ స్టార్ హీరో ఎవరా అని మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా ఆ పేరుపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారనే వార్త, సినీ ప్రేక్షకులకు అతిపెద్ద సర్ప్రైజ్ కానుంది. ఈ మెగా మల్టీస్టారర్ గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.