Chiranjeevi on Anand Mahindra: ఆనంద్ మహీంద్రాపై చిరంజీవి ప్రశంసలు.. మిమ్మల్ని చూస్తుంటే రతన్ టాటా గుర్తొస్తారంటూ..!
Chiranjeevi: భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆనంద్ మహీంద్రాను చూస్తుంటే, ఆయన వినయం, వ్యక్తిత్వం విషయంలో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయుడైన రతన్ టాటా గుర్తుకు వస్తారని చిరంజీవి పేర్కొనడం విశేషం.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ కార్యక్రమంలో చిరంజీవి, ఆనంద్ మహీంద్రా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు.
“డియర్ ఆనంద్ మహీంద్రా జీ, మీ నిరాడంబరత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం నిజంగా ఆదర్శనీయం. అసాధారణమైన విలువలతో ఎదిగి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రతన్ టాటాను మీరు అనేక విషయాల్లో నాకు గుర్తుకు తెస్తారు. మీరు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై మీరు చూపించే అంకితభావం ఎంతోమందికి ప్రేరణనిస్తుంది. మీతో కలిసి ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది” అంటూ చిరంజీవి భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ అపూర్వమైన సమిట్‌లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విజన్‌పై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ – 2047’ దూరదృష్టిలో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. “హైదరాబాద్‌ను కేవలం ఫిల్మ్ హబ్‌గానే కాక, గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ దృష్టి హైదరాబాద్‌పై కేంద్రీకరిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను,” అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్, ఒకేసారి ఇద్దరు దిగ్గజాలపై ప్రశంసలు కురిపించడం, ప్రభుత్వ విజన్‌ను బలపరచడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
