Vishwambhara Update: ‘విశ్వంభర’ వచ్చేది అప్పుడే.. స్పెషల్ వీడియోతో హింట్ ఇచ్చి చిరంజీవి
Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదల ఎందుకు ఆలస్యమవుతోందో స్వయంగా చిరంజీవి ఓ వీడియో ద్వారా వివరించారు. ఈ ఆలస్యం కథ నాణ్యతను పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. “విశ్వంభర చిత్రం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్ (VFX). సినిమా సెకండ్‌హాఫ్ మొత్తం వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని భావించాం” అని తెలిపారు. ఇది కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, ఈ సినిమా ఒక మధురమైన చందమామ కథలాగా ఉంటుందని, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తుందని చిరంజీవి భరోసా ఇచ్చారు.
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విశ్వంభర’ గ్లింప్స్ ఆగస్టు 21 సాయంత్రం 6.06 గంటలకు విడుదల కానుంది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కూడా చిరంజీవి వెల్లడించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన అందాల తారలు త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మౌని రాయ్ ఒక ప్రత్యేక గీతంలో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ డ్యాన్స్ నెంబర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. వంద మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్న ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు మంచి జోష్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
