MM Keeravani: ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన కీరవాణి.. మొత్తం ఎన్ని పాటలు ఉంటాయంటే
MM Keeravani: భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. వీరిద్దరి కలయికలో వస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం వారణాసి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ గురించి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం గోవా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా సంగీతం గురించి క్లారిటీ ఇచ్చారు. “ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. సంగీతం మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేను” అంటూ కీరవాణి నవ్వేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘సంచారి’, ‘రణ కుంభ’ అనే పాటలు బయటకు వచ్చి శ్రోతలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శించిన 4 నిమిషాల గ్లింప్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పురాణాలకు, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి రాజమౌళి సృష్టించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని టాక్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో మహేశ్ త్రిశూలం పట్టుకుని కనిపించిన తీరు గూస్‌బంప్స్ తెప్పిస్తోందట. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “నాకు రామాయణం, మహాభారతం అంటే ప్రాణం. మహేశ్ రాముడి గెటప్‌లో సెట్‌లోకి రాగానే ఆశ్చర్యపోయాను. ఆ లుక్ ఎంత నచ్చిందంటే.. కొన్ని రోజులు నా ఫోన్ వాల్‌పేపర్‌గా కూడా పెట్టుకున్నాను. ఎవరైనా చూస్తారేమో అని మళ్ళీ తీసేశాను” అని సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు ఆర్. మాధవన్ పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట మహేశ్‌కు తండ్రిగా నటిస్తారని వార్తలు రాగా, ఇప్పుడు ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలోనూ, మహేశ్ ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలోనూ కనిపించనున్నారు. 2027 వేసవిలో ఈ అద్భుతం ప్రేక్షకుల ముందుకు రానుంది.
