Tollywood: తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్‌ల నిలిపివేత.. ‘మా’ మద్దతు ఛాంబర్‌కే!
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో షూటింగ్‌ల నిలిపివేత ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. కార్మికుల సంఘాలు, నిర్మాతల మధ్య వేతనాల పెంపు విషయంలో నెలకొన్న విభేదాలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. సినిమా కార్మికులు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నారు. ఈ పరిణామంతో పరిశ్రమలో ప్రతిష్టంభన ఏర్పడింది.
ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తమ వాదనను వినిపిస్తూ, కార్మికులు రోజుకు 15 గంటలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారికి తగిన వేతనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచమని ఎన్నిసార్లు కోరినా ఫిల్మ్ ఛాంబర్ పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. కార్మికుల యూనియన్లను కాదని, బయటి వ్యక్తులతో పని చేయించుకొని శ్రమ దోపిడీకి పాల్పడాలని నిర్మాతలు చూస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు.
దీనికి భిన్నంగా నిర్మాతల మండలి సెక్రటరీ, ఫిల్మ్ ఛాంబర్ కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సినిమా కార్మికుల వేతనాలు ఐటీ ఉద్యోగుల కంటే కూడా అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫెడరేషన్ యూనియన్లలో సభ్యత్వం కోసం ఏడెనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది కార్మికులపై భారాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. ఫెడరేషన్ కార్మికులతోనే పనిచేయాలనే నిబంధన చట్ట వ్యతిరేకమని, ఇది కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. కార్మికులు తమతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, వేతనాలను 30 శాతం పెంచితే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారని ప్రసన్న కుమార్ తెలిపారు. మరోవైపు, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ వివాదానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. వైజయంతి మూవీస్ వంటి సంస్థలు వివిధ విభాగాల్లో పనిచేయడానికి నైపుణ్యం ఉన్న కొత్త వ్యక్తుల కోసం సోషల్ మీడియా ద్వారా దరఖాస్తులను కోరుతున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి సంస్థలు ఫెడరేషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ లాయర్ నోటీసులను పంపాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు చిరంజీవి వంటి సీనియర్ నటుల సహాయం తీసుకోవాలని కొంతమంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.