Mrunal Thakur: అదే అసలైన సక్సెస్.. జీవితంపై మృణాల్ ఠాకూర్ వేదాంతం
Mrunal Thakur: బాలీవుడ్ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న నటి మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ, ఇటీవల తన కెరీర్, సక్సెస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ అంటే ఏమిటని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది.
“ఒక సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఎంత బడ్జెట్ పెట్టారన్నది నాకు ముఖ్యం కాదు. నేను ఆ సినిమాలో ఎంత బాగా నటించానన్నదే నాకు ప్రధానం. నేను బాగా నటించానని నాకు అనిపిస్తే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఉన్నా, నా దృష్టిలో అది విజయమే. ప్రేక్షకులను తృప్తి పరచడమే నా దృష్టిలో నిజమైన విజయం. డబ్బుతో సక్సెస్‌ని కొలిస్తే అది ఎప్పటికీ మారిపోతూనే ఉంటుంది. మనసు తృప్తిపడేలా నటించడం నాకు అసలైన విజయం. ఒక నటిగా నేను ప్రేక్షకులకు తెరపై విసుగు తెప్పించకూడదు, అదే నా అసలైన ఫెయిల్యూర్” అని మృణాల్ తెలిపారు. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక ఇంటర్వ్యూలో నటి బిపాషా బసు గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో మృణాల్ ఠాకూర్ క్షమాపణలు చెప్పింది. బిపాషాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు, అంటే 19 ఏళ్ల వయసులో, ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వివరించారు.
“అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, తెలివి తక్కువగా మాట్లాడాను. అదంతా అందం గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలే. కానీ, అవి ఇంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు అర్థం కాలేదు. అలా మాట్లాడినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. అది ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది. ఆ సమయంలో నా మాటలు ఎవరినీ అవమానించాలనే ఉద్దేశంతో లేవు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అనిపిస్తోంది. కాలంతో పాటుగా అందానికి అసలైన అర్థం నాకు తెలిసింది. అది మనసుతో చూసే విలువైన విషయం” అని మృణాల్ తెలిపారు.