Mrunal Thakur: ఆ సినిమా నా జీవితాన్ని మార్చింది.. : మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: బుల్లితెరపై చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇండస్ట్రీలో ఒక స్థాయికి చేరుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ప్రయాణంలో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమాపై మృణాల్ తాజాగా భావోద్వేగంగా స్పందించింది. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘లవ్ సోనియా’ చిత్రం విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.
మృణాల్ తన పోస్ట్‌లో, “ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. వేల మందిలో నన్ను ‘లవ్ సోనియా’ సినిమా కోసం ఎంపిక చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా అనిపించింది. ఇది కేవలం నా మొదటి సినిమా మాత్రమే కాదు, జీవితాలను మార్చగలిగే సినిమా ప్రపంచంలోకి నేను వేసిన తొలి అడుగు” అని తెలిపింది. సినిమా సెట్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగిన భయం ఇంకా తన మనసులో ఉందని గుర్తు చేసుకుంది.
ఈ సినిమాలో తనతో కలిసి నటించిన డెమి మూర్, రిచా చద్దా, మనోజ్ బాజ్‌పేయీ వంటి గొప్ప నటులు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పారని మృణాల్ పేర్కొంది. “ఆ సమయంలో నేను విశాలమైన సముద్రంలో ఒక చిన్న చేపలా అనిపించాను. కానీ ఈ సినిమా నాకెంతో ఇచ్చింది – మాట్లాడే ధైర్యాన్ని, చిత్ర పరిశ్రమలో మరో కుటుంబాన్ని, ఒక కొత్త జీవనాన్ని” అంటూ ఆమె భావోద్వేగంతో వెల్లడించింది. తనను ప్రోత్సహించిన, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికీ మృణాల్ ధన్యవాదాలు తెలిపింది. ‘లవ్ సోనియా’ సినిమా తన కెరీర్‌ను మాత్రమే కాకుండా, తన జీవితాన్ని కూడా మలిచిందని పేర్కొంటూ, మృణాల్ ఈ పోస్ట్ చేసింది.
కాగా.. ‘సీతారామం’ తర్వాత తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. వాటిలో ‘AA22xA6’ అనే చిత్రం ఒకటి. ఆమె కెరీర్‌లో ఇది ఒక ముఖ్యమైన సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో రూపొందుతోందని సమాచారం.
