శాసనసభ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా ఈ పై నాలుగు వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా పరిపాలన సాగడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి, దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటడానికి పనిచేసే వ్యవస్థలు.
కానీ వ్యవస్థలలో ఉండే లోపాలను అడ్డుపెట్టుకొని చట్టాలను చుట్టాలుగా మార్చుకుని ఆడుకునే నాయకులు, దోచుకునే వ్యక్తుల మధ్య వ్యవస్థలు అపహాస్యం అవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయి అంటూ సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది.
ఈ వ్యవహారంపై రెండు వర్గాలుగా చీలిన పౌర సమాజం
భిన్నమైన వాదనలను చర్చ లోకి తీసుకు వచ్చారు. ప్రభుత్వానికి అనుకూల వర్గం వాదన ఏమిటంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకొని అడుగడుగునా అడ్డు పడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అలాగే 151 మంది శాసనసభ్యులను తమ ఓట్ల ద్వారా ఎన్నుకున్న ప్రజా తీర్పుకు విలువ లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేక వర్గం వాదన ఏమిటంటే ప్రభుత్వం చేసే తప్పులను రాజ్యాంగం కల్పించిన హక్కు అయిన న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుకోవడం తప్పు ఎలా అవుతుంది? అని వాదిస్తున్నారు. అదే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతిపక్ష పార్టీలుగా ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా, జవాబుదారిగా ఉండడం తమ హక్కు అని అంటున్నారు. అంతేకాకుండా న్యాయవ్యవస్థను వేలెత్తి చూపుతూ లేఖ రాయడమే కాకుండా తమ పత్రికల ద్వారా ప్రజల ముందుకు తీసుకు వచ్చిన చర్య న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే అని దీనిని న్యాయవ్యవస్థ తీవ్రమైన చర్య గా పరిగణించి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆ దిశగా మరొక వైపు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుండి జగన్మోహన్ రెడ్డిని తొలగించాలని సుప్రీంకోర్టులో నేడు పిటిషన్ దాఖలైంది. న్యాయవాదులు జి.ఎస్.మణి ప్రదీప్ కుమార్ యాదవ్ లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎన్వి రమణ పై ఆరోపణలు చేస్తూ జగన్ లేఖ విడుదల చేశారు. అంతేకాక జగన్ పై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని అందులో మనీలాండరింగ్ కేసు కూడా ఉన్నాయని ఈ పిటిషన్ లో పొందుపరిచారు. మరి సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను స్వీకరిస్తుందా? ముఖ్యమంత్రి పదవికి జగన్ ని అనర్హుడిగా ప్రకటిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ రగడ దేశవ్యాప్తంగా పెద్ద చర్చను లేవదీసింది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో మరి.