Nadendla in Tenali : తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని, రైతులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా సాగునీటి ప్రాజెక్టుల తుప్పుపట్టిన గేట్లు, కదలని లాకులు, నెర్రెలిచ్చిన కాలువ గట్లు దర్శనమిస్తున్నాయని అన్నారు.
నాలుగేళ్లుగా కనీస నిర్వహణ లేక.. కాలువల వెంట లీకేజీలు, డ్యామేజీలే కనిపిస్తున్నాయని, ముఖ్యంగా కృష్ణా పశ్చిమ డెల్టా- ఆయకట్టులో సాగునీటి సౌకర్యాల దుస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కష్టాలు తీరుతాయి, కన్నీరు తుడుస్తాడని నమ్మి రైతులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ల నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసింది. ముఖ్యంగా రైతులను ఈ ప్రభుత్వం నిలువునా ముంచింది.
ఏటా కాలువలకు నీళ్లు విడుదల చేస్తారు. దీనికి ముందే కాలువలను, బాకులు, షట్టర్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాలువలకు నీళ్లు వదిలాక మరమ్మతులకి టెండర్లు పిలిచారు. ఇదీ వైసీపీ పాలన..అని నాదెండ్ల దుయ్య బట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా కాలువలను మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. ప్రతి రోజు ప్రెస్ కాన్ఫురెన్సులు పెట్టి నీటిపారుదల శాఖ మంత్రి గారు రైతుల పడుతున్న ఇబ్బందులు గురించి తప్ప మిగతావన్ని మాట్లాడతారు.
కృష్ణా పశ్చిమ డెల్టా కింద 5.72 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఈ డెల్టాలో ప్రధాన కాలువలైన దుగ్గిరాల లాకులు శిథిలావస్థకు చేరాయి. గేట్లు తుప్పుపట్టడంతో రాళ్లతో కట్టేశారు. కొమ్మమూరు కాలువ అధ్వాన్నంగా తయారయింది. గేట్లు తుప్పు పట్టి పాడైపోయాయి. గేట్లు మూసేసినా లీకేజీల ద్వారా నీళ్లు బయటకు వస్తున్నాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. అత్యవసరం అయితే తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులేవి రాకపోవడంతో నీటి నిధులతోనే అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో రూ.21 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నీటి తీరువా సొమ్ము రూ. 7 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ.12 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. అది వసూలు చేసుకొని మరమ్మతులు చేసుకోవాలని ప్రభుత్వం షరతు విధించడం దుర్మార్గం. ఆకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. వాళ్ల నుంచి తీరువా సొమ్ము వస్తేనే మరమ్మతులు చేసుకోవాలని చెప్పడం సరికాదు అన్నారు.