Nadendla Manohar in Tenali : రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి నియోజకవర్గ వర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో నిజాయతీగా బలంగా చేసుకున్న నాయకులే కనిపిస్తారు. అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేలా పనిచేయాలి. అందరినీ సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేయండి. ఇంటింటి తనిఖీ అవసరం ఉంది.
తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని అందరూ గుర్తు చేసుకుంటారు. వచ్చే జనసేన ప్రభుత్వంలో తెనాలి నుంచి గెలిస్తే నియోజకవర్గంలో అద్భుతమైన పనులు ఎలా చేస్తామో ప్రజలకు తెలియచేద్దాం అని ఆయన వెల్లడించారు. ఖచ్చితంగా అన్ని వర్గాలవారూ జనసేన వైపు చూస్తున్న సమయంలో అందరం సమష్టిగా పని చేసి, విజయతీరాల వైపు పయనిద్దాం అని నాదెండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం నేతలు వివిధ అంశాలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గానికి మనశ్శాంతి లేదు. ఆఖరికి ఆ పార్టీ తరపున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సైతం ఇదేమి ప్రభుత్వం అని తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. గ్రామాభివృద్ధికి రావాల్సిన నిధులు రావడం లేదు. సొంత డబ్బులతో చేసిన బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు.
గ్రామ స్వరాజ్యం పోయి. జగన్ రాజ్యం వచ్చింది. ఇష్టారీతిన దోపిడీ… అడిగితే దాడులు అన్నట్లు గ్రామాల్లో రౌడీరాజ్యం నడుస్తోంది. గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులూ లేవు. ఉపాధి లేదు అన్నారు. శతస్థాయిలోని వైసీపీ పాలన అరాచకాలను కళ్లకు కట్టినట్లు ఉంచారు. అన్ని విషయాలను పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా విని నోట్ చేసుకున్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా తీరుస్తామని పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చారు.
