Nadendla Manohar – Polavaram : జనసేన గుంటూరు నగర సర్వ సభ్య సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..నిన్న మొన్నటి వరకు పోలవరం కట్టేది నేనే.. నిధులు తెచ్చేది నేనే.. అని బీరాలు పలికిన ముఖ్యమంత్రి నిన్న పోలవరం ముంపు నిర్వాసిత ప్రాంతాల పర్యటన సందర్భంగా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద తోసేశారు. పోలవరం కట్టేది కేంద్రమేనని అక్కడ నుంచి డబ్బులు రావాలని చెబుతున్నారు.
పోలవరం ఎత్తును 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్, పునరావాసం, పరిహారం విషయంలోనూ నిర్వాసితులను మోసం చేసేందుకు కొత్త పన్నాగం పన్నారు అని నాదెండ్ల మనోహర్ గారు అన్నారు.. పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిన ఈ ముఖ్యమంత్రి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి… మాకు కరెన్సీ ముద్రించే అవకాశం లేదు కదా అంటూ కొత్త కథలు చెబుతున్నారు అని వ్యాఖ్యానించారు. జగన్ తీరు ఎలా ఉందంటే అవకాశం ఇస్తే ఆయనే కరెన్సీ ప్రింట్ చేసుకొని ఓ కరెన్సీ అని పెట్టుకొనేవారేమో అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పునరావాస కాలనీలు నిర్మిస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, తాను పోలవరం మొదలుపెట్టి ఉంటే పునరావాసం పూర్తి చేసేవాడిని అంటూ కొత్త మోసానికి తెర తీస్తూ మాయ మాటలు చెబుతున్నారు. కేంద్రం అందించే నిధులకు సరైన లెక్కలు చెప్పడం లేదు. బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చేతులు ఎత్తేశారు. ఇది వైసీపీ చేస్తున్న మహా మోసం అని నాదెండ్ల వెల్లడించారు.
ఆగస్టు 9వ తేదీ 1942లో అప్పటి బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని జనసైనికులు అందిపుచ్చుకోవాలి. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘క్విట్ జగన్’ కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహిద్దాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. క్విట్ జగన్ నినాదం ఖచ్చితంగా అన్ని వర్గాలకు అర్ధమయ్యేలా రాష్ట్రాన్ని రక్షించుకునేలా ప్రజలను సమాయత్తం చేద్దాం. జనసైనికులు క్విట్ జగన్ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో జరిపి, వైసీపీ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెబుదాం.
వైసీపీ ప్రభుత్వంలో సమస్యలకు కొదవలేదు. ప్రజల తరపున, అత్యంత నిజాయితీగా పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ మాత్రమే. దానిని జనం కూడా నమ్ముతున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా జనసైనికులు వస్తారని భావిస్తున్నారు. ఇది అత్యంత నిజాయితీ కలిగిన నాయకుడి సారధ్యంలో నడుస్తున్న జన సైనికుల సమూహబలం. దీన్ని ఇలాగే కొనసాగిద్దాం. ప్రజల తరపున బలమైన పోరాటాలు చేద్దాం…అని నాదెండ్ల పేర్కొన్నారు.