Guntur Kaaram Movie Trolls: గుంటూరు కారంపై ట్రోల్స్ ఎలా చేశార్రా..?
Guntur Kaaram Movie Trolls: ప్రముఖ నిర్మాత నాగవంశీ తన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రాబోతున్న ‘కింగ్డమ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జులై 31న విడుదల కానున్న ఈ సినిమాతో పాటు, గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆయన మాట్లాడారు. ఆ సినిమాను ఎందుకు ట్రోల్ చేశారో ఇప్పటికీ తనకు అర్థం కాలేదన్నారు.
మొదటి రెండ్రోజులు గుంటూరు కారంపై విపరీతమైన ట్రోల్స్..
“సినిమా రంగంలో ప్రతి శుక్రవారం ఒక సర్‌ప్రైజ్. మనం అన్నీ తెలుసనుకుంటే కెరీర్ ముగిసినట్లే. ‘గుంటూరు కారం’ను తొలి రెండు రోజులు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఆ సినిమా బాలేదని ఎక్కడా టాక్ రాలేదు. ట్రోల్ చేయాల్సినంతగా అందులో ఏమీ లేదని నాకు అనిపించింది” అని నాగవంశీ పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో ‘లక్కీ భాస్కర్’, ‘గుంటూరు కారం’ సినిమాలు తనకు ఊహించని అనుభవాలను ఇచ్చాయని తెలిపారు. అలాగే, ‘కుబేర’ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందిందని అన్నారు.

మరోవైపు, దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ (Sirish) ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్‌కు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మధ్య ఉన్న తేడాను ప్రస్తావిస్తూ, డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలను సితార అధినేత నాగవంశీ ఎంతగా పట్టించుకుంటారో వివరించారు. ‘గుంటూరు కారం’ సినిమా వల్ల తమకు వచ్చిన రూ. 8 కోట్ల నష్టాన్ని పూడ్చడానికి నాగవంశీ సహాయం చేశారని శిరీష్ వెల్లడించారు.
మ్యాడ్ స్క్వేర్ ద్వారా రూ. 4 కోట్లు, వ్యక్తిగతంగా మరో రూ. 4 కోట్లు నాగవంశీ అందించారని శిరీష్ ప్రశంసించారు. డిస్ట్రిబ్యూటర్ల గురించి తమ తర్వాత ఆలోచించేది నాగవంశీ మాత్రమే అని శిరీష్ అన్నారు. శిరీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
