Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల వాయిదా.. అందుకే ఈ నిర్ణయం!
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘అఖండ’కు కొనసాగింపుగా వస్తున్న ‘అఖండ 2: తాండవం’ విడుదల వాయిదా పడింది. సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ, నిర్మాణానంతర పనుల కోసం మరికొంత సమయం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు గురువారం అధికారికంగా ప్రకటించాయి.
ప్రేక్షకులకు అత్యున్నతమైన థియేట్రికల్ అనుభూతిని అందించే ఉద్దేశంతోనే ఈ వాయిదా అని నిర్మాతలు తెలిపారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ విషయంలో మరింత నాణ్యత సాధించడం కోసం చిత్రబృందం అదనపు సమయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం, దానిపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను తీర్చిదిద్దడానికి ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నామని నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్ తరఫున రామ్ ఆచంట, గోపి ఆచంట వెల్లడించారు.
ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్ కథానాయికగా నటిస్తున్నారు. యువ నటుడు ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో బాలకృష్ణ అభిమానుల్లో కొంత నిరాశ ఉన్నప్పటికీ, నాణ్యమైన సినిమా కోసం ఎదురుచూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా, బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుపుతూ, చిత్ర యూనిట్ ఒక ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ పనులను ఒకేసారి పూర్తి చేస్తున్నారని సమాచారం.
2021లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. బాలయ్య అఘోర పాత్ర, బోయపాటి దర్శకత్వం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఒక సంచలనంగా నిలిపాయి. ఇప్పుడు ఆ ఫార్ములాను మరింత శక్తివంతంగా ‘అఖండ 2’లో చూపించనున్నారు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా భారీగా వసూలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంజయ్ దత్, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం. ఈసారి యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, సనాతన ధర్మం అంశాలు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
